సోషల్‌ మీడియా వారియర్స్‌ అప్రమత్తంగా ఉండాలి

సోషల్‌ మీడియా వారియర్స్‌ అప్రమత్తంగా ఉండాలి– హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చూస్తున్నారు :బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌ అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో మల్కాజ్‌గిరి నియోజకవర్గ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ పోటీనే కావని, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని, నగరంలో కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారాలు చేయాలని సూచించారు. సోషల్‌ మీడియాలో ఇతర పార్టీలు దుష్ప్రచారం చేయటం వల్ల మనం అధికారం కోల్పోయా మన్నారు. కావునా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌ ఈసారి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ను బీజేపీకి మలచాలని చూస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరిలో 2018లో మర్రి రాజశేఖరరెడ్డి అత్యల్ప తేడాతో ఓడిపోయారని, ఇప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఉండాలన్నారు. మల్కాజిగిరి రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన రుణమాఫీ, పెన్షన్‌పై మాట మార్చారని విమర్శించారు. బీజేపీ నాయకులు ప్రతి ఏడాదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ న్నారని.. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. దేవుడు అంటే అందరికీ గౌరవమని.. రామాలయ నిర్మాణానికి అందరికీ సహకారం ఉందన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, రిజర్వేషన్లు తీసెయ్యాలని చూస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావా లన్నా, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలన్నా తప్పనిసరిగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సెగ్మెంట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love