కేరళను తాకిన నైరుతి

South West hit Kerala– ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం
న్యూఢిల్లీ : మండే ఎండలతో అల్లాడిపోయిన దేశ ప్రజానీకానికి చల్లని కబురు అందింది. అనుకున్నదానికన్నా ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. సాధారణంగా జూన్‌ 1వ తేదీకి ఒక రోజు అటూ ఇటూగా కేరళకు రుతుపవనాలు వస్తాయి. నెమ్మదిగా జులై 15నాటికి దేశమంతా విస్తరిస్తాయి. రుతుపవనాల రాకకు అవసరమైన వాతావరణ పరిస్థితులన్నీ సానుకూలంగా వున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతునే వచ్చారు. ఈ ఉదయం తొలకరి జల్లులు కేరళను పలకరించాయి. కేరళ, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. వరుసగా రెండు రోజుల పాటు కేరళలోని 14 ప్రాంతాల్లో 2.5మి.మీ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల బలాన్ని సూచించేలా పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. నాలుగు మాసాల పాటు వుండే నైరుతి రుతుపవనాల సీజన్‌లో కేరళ సగటు వర్షపాతం 2018.7మి.మీగా వుంటుంది. అందులో ప్రారంభ మాసమైన జూన్‌లో కురిసే వర్షం దాదాపు 648.3 మి.మీగా వుంటుంది. 123 సంవత్సరాల కేరళ రుతుపవనాల డేటాను పరిశీలిస్తే జులైలో అధిక వర్షపాతం నమోదవుతుంది. సగటున 653.4 మి.మీ వుంటుంది.
ఈసంవత్సరం కేరళకు, మొత్తంగా దేశానికి సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేసింది. రుతుపవనాల ప్రారంభంలో లానినా ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు వుండడం కూడా లాభించే అవకాశంగా వుంది.
ఇటీవల సంభవించిన రెమాల్‌ తుపాను కారణంగా పరిస్థితులన్నీ సానుకూలించి ఈశాన్య ప్రాంతాలకూ రుతుపవనాలు ముందుగా, త్వరగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరాం, మణిపూర్‌, అసోంలకు సాధారణంగా రుతుపవనాలు వచ్చే తేదీ జూన్‌గా వుంటుంది. ఈసారి నాలుగైదు రోజులు ముందుగానే వస్తున్నాయి.

Spread the love