జిల్లా, మండల పరిషత్‌లకు ప్రత్యేక బాధ్యులు..?

Special responsible for district and mandal parishads..?– జులై 4న ముగియనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ఇప్పటికే ప్రత్యేక పాలనలో గ్రామ పంచాయతీలు
– మరో రెండునెలల్లో మున్సిపాలిటీలదీ అదే పరిస్థితి
– ఎన్నికలపై బడ్జెట్‌ సమావేశాల తర్వాతే ప్రభుత్వ నిర్ణయం?
స్థానిక సంస్థల్లో భాగమైన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గా(ఎంపీటీసీ)ల ఐదేండ్ల పదవీకాలం జులై4తో ముగియనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించే అవకాశముంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం
ముగిసి ఐదు నెలలు అవుతోంది. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులంతా మాజీలయ్యారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా మాజీలు కానున్నారు. పార్టీల పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వాళ్లే 95 శాతం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుంటారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో చాలా మంది ఎంపీటీసీలు, కొందరు జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్‌, బీజేపీలో చేరారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 534 జెడ్పీటీసీ, 5659 ఎంపీటీసీ స్థానాలకు 2019 మే 6, 10, 14 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అదే నెల 7న మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష పదవికి, 8న జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మెన్‌ పదవులకు ఎన్నిక జరిగింది. 32 జిల్లా ప్రజా పరిషత్‌లకు చైర్మెన్స్‌, వైస్‌ చైర్మెన్స్‌, కో-ఆప్షన్‌ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 372 జెడ్పీటీసీ స్థానాల్ని అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ గెల్చుకుని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పదవుల్ని దక్కించుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి 53 జెడ్పీటీసీలే దక్కాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 68 జెడ్పీటీసీ, 708 ఎంపీటీసీ స్థానాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 25 జెడ్పీటీసీ, 295 ఎంపీటీసీ స్థానాలు, సిద్దిపేట జిల్లాలో 23 జెడ్పీటీసీ, 224 ఎంపీటీసీ స్థానాలు, మెదక్‌ జిల్లాలో 20 జెడ్పీటీసీ, 189 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడు జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్‌ పదవుల్ని కూడా బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. వారి పదవీకాలం జులై4తో ముగియనుంది. స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ లోకల్‌ బాడీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఐదేండ్లకోసారి విధిగా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల ద్వారా పరిపాలన అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే పథకాలు, అభివృద్ధి పనులన్నీ కూడా జిల్లా, మండల పరిషత్‌ల ఆమోదంతో అమలు చేయబడతాయి. ఐదేండ్ల పదవి కాలం ముగియనుండడంతో జిల్లా, మండల పరిషత్‌లకు కూడా పాలక వర్గాల్లేకుండా పోతాయి.
ప్రత్యేక పాలనేనా..
ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీకాలం ఫిబ్రవరి 2తో ముగిసింది.. గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరపడం వీలు కానందున ప్రభుత్వం ప్రత్యేక అధికారుల్ని నియమించింది. తాజాగా జిల్లా, మండల పరిషత్‌లకు కూడా పాలకవర్గాలు రద్దు కానున్నందున ప్రత్యేక పాలన వచ్చే అవకాశముంది. జాతీయ ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్స్‌ ఇలా అనేక పద్దుల ద్వారా వచ్చే నిధులతో చేపట్టే పనులకు జిల్లా, మండల పరిషత్‌ లోకల్‌ బాడీల తీర్మానాలు కావాల్సి ఉంటుంది. అందు కోసం విధిగా ప్రత్యేక అధికారుల్ని నియమించాల్సి ఉంటుందన్నారు. జిల్లా పరిషత్‌లకు జెడ్పీ సీఈఓలు, మండల పరిషత్‌లకు ఎంపీడీఓలు పరిపాలనా వ్యవహారాలు చూస్తారు. వారినే ప్రత్యేక అధికారులుగా పెడతారా..? లేక వివిధ శాఖల జిల్లా అధికారులకి ప్రత్యేక అధికారులుగా బాధ్యతలిస్తారా..? అనేది చూడాలి. మరో రెండు నెలలు గడిస్తే మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగియనుంది. వాటికి కూడా ఎన్నికలు జరిగే గ్యారంటీ ఏమీలేదు. రాష్ట్రంలో బీసీ కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల మార్పు వంటి కారణాలతో లోకల్‌బాడీ ఎన్నికలు జరగడం లేదని తెలుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపాలి: మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌, సంగారెడ్డి
రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా స్థానిక సంస్థలకు ప్రతి ఐదేండ్లకోసారి విధిగా ఎన్నికలు జరపాలి. రాష్ట్రంలో పంచాయతీల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపలేదు. ప్రస్తుతం జిల్లా, మండల పరిషత్‌ల పదవీ కాలం కూడా ముగియవస్తుంది. లోకల్‌బాడీలకు ఎన్నికలు జరపకుండా వాయిదా వేయడం మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వం ఎన్నికలు జరపలేని పరిస్థితి ఉంటే ప్రస్తుత ప్రజా ప్రతినిధులను కొంత కాలం కొనసాగించడం మంచిది.

Spread the love