నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా

– రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం
– జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌
నవతెలంగాణ-జగిత్యాల
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నమోదైన కేసులలో నాన్‌ గ్రేవ్‌ కేసులు, గ్రేవ్‌ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు అధికారులకు వివరించామన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే వెంటనే ఫోటోలు సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్‌ పర్సన్‌ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్‌ కేసులను ఛేదించవచ్చని సూచించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్‌ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్‌ పరిధిలో ఒక స్పెషల్‌ టీంను నియమించి వాటి నివారణకు కృషి చేయాలన్నారు. నేర నియంత్రణ చర్యలలో కీలక పాత్ర పోషించే సిసి కెమెరాల ఏర్పాటులో ప్రజలకు అవగాహన కలిగిస్తూ భగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి రోజూ డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచాలని, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలని సూచించారు. మార్కెట్లో బిటి3 పత్తి విత్తనాలకు ఎలాంటి పర్మిషన్‌ లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని సూచించారు. ఎవరైనా విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు, వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రవీంధ్ర కుమార్‌, రఘు చందర్‌, ఉమామహేశ్వరరావు, రంగారెడ్డి, వ్యవసాయ అధికారులు, డిసీఆర్బి, సిసిఎస్‌ ఐటి కోర్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, రఫీక్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Spread the love