– నేడు అఫ్గాన్‌తో బాబర్ సేన ఢీ
చెన్నై : 2023 ఐసీసీ ప్రపంచకప్ రసవత్తరంగా మారుతోంది. డిఫెండింగ్ చాంపి యన్ ఇంగ్లాండ్‌ను అఫ్గనిస్థాన్ ఓడించగా, ధనాధన్ దంచికొడుతు న్న దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించింది. చిన్న జట్లు అద్భుత ప్రదర్శనతో అభిమానుల దృష్టిని తమవైపునకు తిప్పుకుంటు న్నాయి. ఇంగ్లాండ్‌ను ఓడించిన అఫ్గనిస్థాన్ నేడు చెపాక్‌లో పాకిస్థాన్‌పై సైతం విజయం సాధించాలనే సంకల్పంతో కనిపిస్తోంది. స్పిన్ స్వర్గధామం చెపాక్‌లో అఫ్గనిస్థాన్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్, మహ్మద్ నబిలు అత్యంత ప్రమాదకరం కానున్నారు. గత మ్యాచ్‌లో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు నేడు తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు మ్యాచుల్లో రెండే విజయాలు సాధించిన పాకిస్థాన్.. మరో మ్యాచ్‌లో ఓడితే సెమీఫైనల్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగలదు. ఇదే సమయంలో అఫ్గనిస్థాన్‌కు ఓ ఓటమి ఆ జట్టును టాప్-4 రేసు నుంచి నిష్క్రమించేలా చేస్తుంది. దీంతో నేడు అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
స్పిన్ పిచ్‌పై పాక్ పేసర్ షహీన్ అఫ్రిది అదరగొట్టాడు. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు ఆకట్టుకునే ఎకానమీ సాధించాడు. ఆసీస్‌తో మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే నేటి మ్యాచ్‌కు సైతం వాడుతున్నారు. దీంతో అఫ్రిది మరోసారి పాకిస్థాన్‌కు కీలకం కానున్నాడు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌లు పాక్‌కు ఆశించిన మాయజాలం చేయటం లేదు. కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాట్‌తో నిరాశపరుస్తున్నాడు. మహ్మద్ రిజ్వాన్ నిలకడగా మెప్పిస్తున్నా.. సహచర బ్యాటర్ల నుంచి మద్దతు లభించటం లేదు. షకిల్, షఫిక్‌లు ఆరంభంలో ఆరంభంలో చూపిన తెగువ ఇప్పుడు చూపించటం లేదు. ఇటీవల అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్ సైతం పాకిస్థాన్‌కు భావోద్వేగ సమరంగా మారింది. దీంతో ఇటు అఫ్గనిస్థాన్‌కు, అటు పాకిస్థాన్‌కు నేడు చెపాక్‌లో విజయమే లక్ష్యం. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్ మధ్యాహ్నాం 2 గంటలకు ఆరంభం కానుంది.