తెలంగాణకు ‘ముంపు మేస్త్రి’గా రేవంత్
మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర జలహక్కులను తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా తాకట్టు పెట్టారని మాజీ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణను ముంచే ముంపు మేస్ర్తిగా రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం పూర్తిగా హాస్యాస్పదమని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన, ఆర్‌డీఎస్‌కు ఎగువన 35 టీఎంసీల సామర్థ్యంతో ‘నవేలి రిజర్వాయర్‘ నిర్మాణానికి పూనుకుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన, సుంకేసుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో ‘గుండ్రేవుల’ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. రెండు రాష్ర్టాలు కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా చేస్తున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టుపై 2013 నాటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్‌లో చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. సిల్టేషన్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి తప్ప కొత్త ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదని, గుండ్రేవులకు నీటి కేటాయింపులు చేయలేమని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టారని చెప్పారు. రేవంత్ రెడ్డికి నదీ జలాలపై అవగాహన తక్కువని తెలిపారు. మూడు రాష్ట్రాల మధ్య గొప్ప ఒప్పందం జరిగిందంటున్న రేవంత్ రెడ్డి.. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల న్యాయమైన వాటా సాధించారా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా 9.5 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీలు కడుతోందని తెలిపారు. కర్ణాటక బ్యారేజీల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కర్ణాటక 35 టీఎంసీల నవేలి, 9.5 టీఎంసీల బ్యారేజీలతో మొత్తం 45 టీఎంసీల నీటిని ఆపేస్తే.. ఆర్డీఎస్‌కు 5 టీఎంసీలు కూడా రావనీ,.. శ్రీశైలంకు నీళ్లు తగ్గి పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారి ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీటికి కూడా కొత్తగా అనుమతులు సాధించలేదని విమర్శించారు. ప్రతి దశలోనూ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తూ, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సీక్రెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు, కేంద్ర కార్యదర్శి కాంతారావు ఏం చెప్పారో రేవంత్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర జల హక్కులు తాకట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



