Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపల్లె యువతకు ప్ర‌పంచ‌స్థాయి భవిష్యత్తు

పల్లె యువతకు ప్ర‌పంచ‌స్థాయి భవిష్యత్తు

- Advertisement -

ఉట్నూర్ ఏటీసీ విజయగాథ
అత్యాధునిక శిక్షణతోనే ఎంఎన్సీలలో ఉద్యోగాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర యువత జీవితాలను మార్చేస్తున్నాయి. నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాద‌నే యోచ‌న‌తో ప్ర‌జా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) సాధించిన విజయం యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన యువతకు ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలు అందించి, ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఉట్నూర్ ఏటీసీ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఏకంగా 99 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం విశేషం. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి, పరిమిత వనరులతో చదువుకున్న విద్యార్థులు నేడు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం వెనుక ప్ర‌జా ప్రభుత్వం అందించిన ఆధునిక శిక్షణ, పరిశ్రమలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు, నిపుణుల మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించాయి. ప్రతిభకు అవకాశం కల్పిస్తే పల్లె యువత కూడా ప్రపంచ స్థాయిలో సత్తా చాటగలరని ఉలట్నూర్ విద్యార్థులు మరోసారి నిరూపించారు.

మ‌ల్టీ నేష‌నల్ కంపెనీల్లో …
ప‌క్కా గ్రామీణ ప్రాంత‌మైన ఉట్నూర్ ఏటీసీలో శిక్షణ పొందిన విద్యార్థులను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు నేరుగా ఎంపిక చేశాయి. ష్నైడర్ ఎలక్ట్రిక్ 47 మందికి, టాటా మోటార్స్ (పుణె) 36 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ఆపిల్ ఐఫోన్ డివిజన్ 14 మంది యువతులను ఎంపిక చేసింది. మంచి వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు రావడంతో వారి కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. పల్లె నుంచి బెంగళూరు వరకు యువత ప్రయాణం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని కల్పించింది.

ఆధునిక శిక్షణతోనే ఎంఎన్సీలలో ఉద్యోగాలు
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించి నిర్వ‌హిస్తున్న‌ ఏటీసీలో విద్యార్థులకు ఇండస్ట్రీ 4.0, సీఎన్‌సీ మెషినింగ్, రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలనే బోధించడం వల్ల ప్రముఖ కంపెనీలు నేరుగా క్యాంపస్‌కు వచ్చి నియామకాలు చేపడుతున్నాయి. పరిశ్రమ అవసరాలు, శిక్షణ మధ్య ఉన్న అంతరాన్ని ఏటీసీలు సమర్థంగా తగ్గిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

అవకాశాలు కల్పిస్తే..
అవకాశాలు కల్పిస్తే..ఏదైనా సాధించవచ్చని ఊట్నూర్‌ ఏటీసీ లో శిక్ష‍ణ పొందిన అభ్యర్థులు రుజువు చేశారు. పల్లె , గిరిజన ప్రాంతంలో జన్మించడం భవిష్యత్తుకు అడ్డంకి కాదని, సరైన అవకాశాలు, నాణ్యమైన శిక్షణకు ఆత్మవిశ్వాసం తోడైతే ప్రపంచ స్థాయి కంపెనీల్లో కూడా ఉద్యోగాలు సాధించవచ్చని ఆ విద్యార్థులు నిరూపించారు. ప్రతిభకు ప్రాంతం అడ్డుకాదని, నైపుణ్యమే అసలు అర్హత అని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

​ఇదే తరహాలో..
ఇదే తరహాలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా భారీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఉద్యోగ మేళాలు నిర్వహించి, పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

​’తెలంగాణ రైజింగ్–2047’లో భాగంగా మెగా జాబ్‌మేళాలు
​తెలంగాణను ఉపాధి, పరిశ్రమలు, నైపుణ్యాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ కింద భారీ ఉద్యోగ కల్పన కార్యక్రమాలు చేపడుతోంది. పరిశ్రమలు, ఉద్యోగ సంస్థలు, శిక్షణ కేంద్రాలు, అప్రెంటిస్‌షిప్ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఉద్యోగార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని శనివారం సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -