ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ నాగరత్న
న్యూఢిల్లీ : త్రి భాషా పథకంలో భాగంగా 9వ తరగతి విద్యార్ధులకు థర్డ్ లాంగ్వేజ్ (ఆర్3)ని ప్రవేశపెట్టవద్దని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న గురువారం బహిరంగ కోర్టులో ప్రభుత్వానికి మౌఖికంగా విజ్ఞప్తి చేశారు. ఏడాది కాలంలో బోర్డు పరీక్షలు వున్నందున విద్యార్ధులకు ఇది చాలా ఒత్తిడిగా వుంటుందని పేర్కొన్నారు. ఆరవ తరగతిలో థర్డ్ లాంగ్వేజ్‌ను ప్రవేశపెట్టాలని, 9వ తరగతిలో నిలిపివేయాలని అన్నారు. ఈ తృతీయ భాషను 9వ తరగతిలో ఆపేయాలి కానీ అప్పడు ప్రవేశపెట్టరాదని డివిజన్ బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న ఆమె వ్యాఖ్యానించారు. 10వ తరగతి బోర్డు పరీక్షల ఒత్తిడి 8వ తరగతి నుండే ఆరంభమవుతుందన్నారు. ఆరవ తరగతిలోనే ఈ థర్డ్ లాంగ్వేజ్‌ను ఎందుకు ప్రవేశపెట్టరాదని ప్రశ్నించారు. 10వ తరగతికి ఉద్దేశించిన పాఠాలు 8వ తరగతిలోనే ప్రారంభమయ్యేవని, ఇదంతా కూడా 1976 నాటి సంగతని, అప్పడే అలా వుంటే ఇక ఇప్పడు పిల్లలపై ఆ ఒత్తిడి, భారం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. తమిళనాడులో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. నవోదయ పథకం ద్వారా సెంట్రల్ స్కూళ్ళ ప్రయోజనాలను తమిళనాడుకు చెందిన పిల్లలు పొందకుండా నిరాకరించవద్దంటూ తమిళనాడు ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న సూచించారు. నవోదయ పాఠశాల్లో చేరే అవకాశాన్ని పిల్లలకు తిరస్కరించకుండా తమిళనాడు తన సొంత విద్యా వ్యవస్థను అమలు చేసుకోవచ్చని సూచించారు. త్రి బాషా పథకం కింద హిందీ తప్పనిసరి కాదని ఆమె పేర్కొన్నారు.
9వ తరగతిలో థర్డ్ లాంగ్వేజ్ ఆపండి
- Advertisement -
- Advertisement -



