మహిళల విషయంలో ఇక ఆ పదాలు వాడొద్దు..

నవతెలంగాణ-హైదరాబాద్ : కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళల పట్ల లింగ వివక్ష లేకుండా చూసే విషయంలో కీలక ముందడుగు పడింది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వాక్యాలకు సంబంధించి ఓ హ్యాండ్‌బుక్‌ను బుధవారం ఉదయం విడుదల చేసింది సుప్రీం కోర్టు. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో అనుచిత పదాలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేసింది. ‘హ్యాండ్‌బుక్‌ ఆన్‌ కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియోటైప్స్‌’ పేరుతో 30 పేజీల పుస్తకాన్ని విడుదల చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. ఇందులో మహిళలను కించపరిచే విధంగా ఉన్న 40 పదాలను గుర్తించింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను హ్యాండ్​ బుక్​లో పొందుపరిచింది. వాటి బదులుగా వాడాల్సిన పదాలను సూచించింది. లింగ వివక్షకు నిర్వచనం, న్యాయాధికారుల్లో అవగాహనను పెంపొందించడమే ఈ హ్యాండ్‌బుక్‌ లక్ష్యమని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. మహిళలపై మూసధోరణిలో వాడే పదాలను గుర్తించేందుకు న్యాయమూర్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో ఇది అందుబాటులో ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

Spread the love