బంధం మరింత బలోపేతం

– చైనా, రష్యా అంగీకారం
– ఉక్రెయిన్‌ సమస్యకు రాజకీయ పరిష్కారానికి ప్రణాళిక
– పాలస్తీనా సమస్యకు రెండు దేశాల ఏర్పాటే పరిష్కారం : సంయుక్త ప్రకటన విడుదల
బీజింగ్‌: చైనా, రష్యా మధ్య సహకార బంధాన్ని మరింత బలోపేతం గావించాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి పలు ఒప్పందాలపై చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ గురువారం సంతకాలు చేశారు. ఆ తరువాత వారు ఒక సంయుక్త ప్రకటన విడుదలజేశారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకోవడం ద్వారా కొత్త శకాన్ని నెలకొల్పేందుకు ఇరువురు నేతలు ప్రతినబూనారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలనే విషయంలో రష్యా,చైనా నిబద్ధతను ఈ సంయుక్త ప్రకటన చాటిచెబుతోంది. ఉక్రెయిన్‌ సమస్యకు సరైన రాజకీయ పరిష్కారం చూపాలనే దానిపై ఇరు దేశాలు ఏకీభావంతో ఉన్నాయి. పుతిన్‌ రెండు రోజుల చైనా పర్యటన శక్రవారంతో ముగిసింది. .ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మాట్లాడుతూ రష్యా, చైనా మధ్య సంబంధాలు స్థిరమైనవి, రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలే కాకుండా ప్రాతంతీయ, ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సులకు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. చైనా, రష్యా రెండూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు, అభివృద్ధి చెందున్న ప్రధాన మార్కెట్‌లని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.
చైనా, రష్యా మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు. రెండు దేశాలు ఈ సందర్భఆన్ని కొత్త శకం ప్రారంభానికి బిందువుగా తీసుకోవాలని, ద్వైపాక్షిక సహకారాన్ని సుసంపన్నం చేసుకోవాలని జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. పుతిన్‌ మాట్లాడుతూ, చైనాతో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడం, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్‌, షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (షాంఘై సహకార కూటమి) వంటి ఫ్రేమ్‌వర్కులలో సన్నిహితంగా కమ్యూనికేట్‌ చేసుకోవడం, సహకరించుకోవడం, మరింత న్యాయమైన, సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ క్రమాన్ని ఏర్పాటు చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, ప్రకృతి పరిరక్షణ, తనికీ, మీడియా వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు సంబంధించిన ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.
పాలస్తీనా- ఇజ్రాయిల్‌ వివాదానికి తక్షణమే తగు పరిష్కారాన్ని చూపాల్సిన అవసరముందని పుతిన్‌, జిన్‌పింగ్‌ ఇద్దరూ చెప్పారు. రెండు దేశాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని వారు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితిపై రెండు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణను నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని, అణ్వాయుధాల తొలి ప్రయోగాన్ని నిషేధిస్తూ అణ్వస్త్ర దేశాలన్నీ ఒక ఒప్పందానికి రావాలని వారు సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగాను, అంతరిక్షంలో క్షిపణి రక్షణ వ్యవస్థ విస్తరణ, సైనిక ప్రయోజనాలకు కోసం వాటిని వినియోగించడానికి అమెరికా యత్నించడంపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అనుసరిస్తున్న సంఘర్షణ విధానాలకు స్వస్తిపలకాలని, ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం మానుకోవాలని ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వైఖరిని విడనాడాలని చైనా, రష్యా పిలుపునిచ్చాయి. చైనా లక్ష్యంగా అమెరికా రూపొందించిన ఆసియా పసిఫిక్‌ వ్యూహాన్ని, ఆకస్‌ కూటమి ఏర్పాటును తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఇరువురు నేతలు చెప్పారు.

Spread the love