‘అస్సాం సీఎం హిమంత్‌ బిస్వా శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలి’

– దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ఇటీవల ప్రభుత్వ అధికార కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత్‌ బిస్వా శర్మ శూద్ర జాతులు, దళిత బహుజనులపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హిమాయత్‌ నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కష్ణ స్వరూప్‌ మాట్లాడుతూ ఆర్య బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్యలు మూడు వర్ణాలకు సేవలు చేయడానికే శూద్రులను బ్రహ్మ పుట్టించారని, శూద్రులు మూడు వర్ణాలకు బానిసలుగా ఉండాలనే సనాతన ధర్మం మార్గంలో బీజేపీ సర్కార్‌ పని చేస్తుందని మాట్లాడడం, కుల విచ్ఛిన్నం, ద్వేషం, దురహంకారంతో రాజ్యాంగం నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడిన అస్సాం సీఎంపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షాను ఆయన డిమాండ్‌ చేశారు. హిమంత్‌ బిస్వా వ్యాఖ్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శూద్ర జాతులు, దళిత బహుజనులకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.వెంటనే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్‌ చేయా లని అస్సాం గవర్నర్‌, భారత రాష్ట్రపతిలను కోరారు.ఈ వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ నిజ స్వరూపం బట్టబయలైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు బుద్ధి తెచ్చుకొని పరివర్తన చెందాలని ఆయన హితవు పలికారు.ఈ కార్యక్ర మంలో పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ శాఖ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్‌ కుమార్‌, దళిత బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఇటికాల గణేష్‌, నాయకులు పెండ్యాల సుచంద్రరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love