జూన్‌ 8, 9, 10 తేదీల్లో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్‌ 8, 9, 10 తేదీల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపల ఆహార దినోత్సవం (ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌) నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహణపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పెరిగిన మత్స్య సంపదను చాటేలా ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తాం. స్వయం ఉపాధి పొందే విధంగా అన్ని జిల్లాలకు చెందిన మహిళా మత్స్యకారులకు చేపలతో వివిధ రకాల వంటకాల తయారీపై ఉచితంగా శిక్షణ ఇచ్చాం. వారి భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్‌లో 20 నుంచి 40 వరకు చేప వంటకాల స్టాళ్లు ఏర్పాటుచేస్తాం. ప్రతిచోటా విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాల్‌ను కూడా పెడతాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించే ప్రదర్శనలుంటాయి. ఈ రంగానికి విశేష సేవలు అందించిన వారిని సన్మానిస్తాం అని తలసాని తెలిపారు.

Spread the love