కాళేశ్వరంలో నిర్మాణ లోపాలు

In Kaleswaram Structural defects– ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం
– లక్ష్మిబ్యారేజీలోనూ నాణ్యతా రాహిత్యమే
– యాసంగి సాగు, తాగునీటికి ఇబ్బందే
– సాధారణ కట్టడంతోనే సమస్యలు
– బేస్‌మెంటులో ‘సీసం’ లేదంటున్న సాగునీటిరంగ నిపుణులు
– భారీ నిల్వలతోనూ కావొచ్చు
– వేగంగా చర్యలు: ఎల్‌అండ్‌టీ
– స్పందించని సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ సర్కారు నిర్మించిన మెగా ప్రాజెక్టు కాళేశ్వరంపై భ్రమలు విడుతున్నాయి. ఒక్కొక్కటిగా నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు చెదలు పట్టినట్టయింది. నాణ్యతారాహిత్యం స్పష్టమవుతున్నది. సుదీర్ఘ కాలంపాటు నిర్మాణం చోటుచేసుకున్నా, పరిస్థితి దారుణంగా మారటం అనుమానాలకు తావిస్తున్నది. అవినీతి, అవకతవకలకు జరిగిందనడానికి లక్ష్మీ బ్యారేజీ నిర్మాణమే సాక్ష్యమని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. కడెం ప్రాజెక్టు మినహా మరే ప్రాజెక్టు ఇప్పటి వరకూ కూలిపోలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్ష్మిబ్యారేజీ రెండోసారి సమస్య లకు కేంద్రబిందువైంది. ఇంతకుముందు భారీ వర్షాల నేపథ్యంలోవచ్చిన వరదలకు రక్షణ గోడ కూలి మొత్తం 16 మోటార్లకుగాను ఏడు మోటార్లునీటమునిగిన విషయం విదితమే. దాదాపు రూ. 1849 కోట్లతో లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) కంపెనీకి పనులు కట్టబెట్టారు. నాసిరకం పనులే లక్ష్మి బ్యారేజీ కుంగుబాటుకు కారణమని సమాచారం. శనివారం రాత్రి చోటుచేసుకున్న భారీ శబ్దాలు ప్రాజెక్టు నాణ్యతను ప్రశ్నార్థకం చేశాయి. ప్రభుత్వం 2016, మే రెండో తేదీన లక్ష్ష్మిబ్యారేజీకి శంకుస్థాపన చేసింది. 2019 జూన్‌ 21న ప్రారంభించింది. 85 గేట్లతో 1.632 కిలోమీటర్ల పొడవునా బ్యారేజీ నిర్మాణం చోటుచేసుకుంది. సుమారు 16.17 టీఎంసీల నిల్వసామర్థ్యంతో కూడుకున్నది. జయశంకర్‌- భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌ మండలం మేడిగడ్డ గ్రామ పరిధిలో లక్ష్ష్మిబ్యారేజీ నిర్మాణమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు స్టార్టింగ్‌ పాయింటు లక్ష్మీబ్యారేజీ కావడం గమనార్హం.
గోదావరి నీళ్లను సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడమే ఈ బ్యారేజీ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఒప్పందం(ఎంవోయూ)సైతం చేసుకున్నారు. 18.50 లక్షల ఎకరాలను ఆయకట్టులోకి తీసుకురావడమే ప్రాజెక్టు ఉద్దేశం. కాగా బ్యారేజీలోని 18,19,20, 21 పిల్లర్ల మధ్య భారీ విస్పోటనం చోటుచేసుకోవడంతో దాదాపు అడుగున్నర మేర బ్యారేజీ వంతెన కుంగిపోయిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీనిపై పనులు చేసిన వర్కింగ్‌ ఏజేన్సీ ఎల్‌అండ్‌టీ నామమాత్రంగానే స్పందించింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌ మేరకే నిర్మించామనీ, గత ఐదు వరద సీజన్లను బ్యారేజీ తట్టుకుందని గుర్తుచేసింది. ఈ ఏడాదిలో వరదలు వచ్చినా, ఎలాంటి సమస్యా రాలేదని ఎల్‌అండ్‌టీ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.సురేశ్‌కుమార్‌ చెప్పారు. సాంకేతిక బృందాన్ని ఇప్పటికే పంపామనీ, లోపాలను తొందరగా గుర్తించి పరిష్కారం కనుగొంటామని వివరణ ఇచ్చారు. అయితే కుంగుబాటుకు గల కారణాలను ఎల్‌అండ్‌టీ ఇచ్చిన ప్రకటనలో తెలియజేయలేదు. సాగునీటీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, రాష్ట్ర సాగునీటి,ఆయకట్టుశాఖగానీ ఎలాంటి స్పందనా లేకపోవడం మరిన్నీ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. లక్ష్ష్మిబ్యారేజీ నిర్మాణం పటిష్టంగా జరగలేదని సాగునీటి రంగం నిపుణులు అంటున్నారు. బేస్‌మెంట్‌ పక్కాలేదనీ చెబుతున్నారు. దాదాపు 200 అడుగుల వరకూ బేస్‌మెంట్‌ పటిష్టంగా ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదనేది వారి వాదన. ప్రాజెక్టు మాన్యువల్‌ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అవేమీ ఇందులో పాటించలేదని సమాచారం. ప్రాజెక్టు బేస్‌మెంటును నిర్మించే సమయంలో సిమెంటుతోపాటు ‘సీసం(లెడ్‌)’ను కూడా కలపాల్సి ఉంటుంది. ఇది లక్ష్ష్మిబ్యారేజీ నిర్మాణంలో జరగలేదనే అరోపణలు వస్తున్నాయి.ఇకపోతే అక్కడున్న ఇసుకను పూర్తిస్థాయిలో తోలగించకపోవడం ఈ సమస్యకు మరో కారణమని తెలిసింది. అలాగే టెక్నాలజీ వాడకం సైతం సరిగ్గాలేదనేది సాగునీటి ప్రాజెక్టు నిపుణుల విమర్శ. ప్రస్తుత పరిస్థితి మూలంగా వచ్చే యాసంగికి సాగు, తాగునీటి సమస్యలు రావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ బ్యారేజీ ద్వారా ఎల్లంపల్లి నుంచి మల్లనన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు రాకపోవచ్చనే అనుమానాలున్నాయి. దీంతో మళ్లీ వర్షాలు, వరదలు వచ్చేవరకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీ వంతెన కుంగుబాటుకు సంబంధించి విచారణ జరిపించాలని సాగునీటిరంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం జరిగిందా ? సాంకేతి పరమైన అంశాలనూ పరిశీలించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక నష్టాన్ని నిర్మాణ సంస్థపైనే వేయాలని సూచించారు.
లక్ష్ష్మిబ్యారేజీ కుంగుబాటుకు అసాంఘీక శక్తుల ప్రమేయం ఉందనే నెపంతో పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. బ్యారేజీ పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్‌చేశారు. అయితే నాణ్యతా లోపాలపై అధ్యయనం చేయకుండా అసాంఘీక శక్తుల మీద తోసివేసే ప్రయత్నం జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వదిలేసి, ఇప్పుడు తప్పించుకునే వైఖరి తీసుకోవడం కూడా అనుమానాలు పెరగడానికి ఆస్కారమేర్పడుతున్నది.
ఇదిలావుండగా, కొత్త ప్రాజెకు ఏది కట్టినా నిల్వల విషయంలో కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని సమాచారం. ప్రాజెక్టు నిల్వలను తట్టుకునే సామర్థ్యమున్నా, ఒకేసారి భారీస్థాయిలో జలాలను నిల్వచేయరాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్ష్మిబ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. అధికారిక సమాచారం ప్రకారం ఘటన జరిగే రోజుకు 10 టీఎంసీ నీళ్లే బ్యారేజీలో ఉన్నాయి. మరీ బ్యారేజీ ఎందుకు కుంగుబాటుకు గురైందనే విషయంలో ఇప్పటికీ ఇటు నిర్మాణ కంపెనీ గానీ, అటు సాగునీటి శాఖ నుంచి స్పష్టత రాలేదు. బేస్‌మెంటు నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలే పిల్లర్లు దెబ్బతిని బ్యారేజీ వంతెన కుంగుబాటుకు అవకాశమేర్పడిందని చెబుతున్న వారూ ఉన్నారు.

Spread the love