స్టూడేంట్ కేరాఫ్ స్టూడేంట్ ట్రైబ్

Student Care of Student Tribeఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టనికోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. మన దేశానికి ఇదే అతిపెద్ద వనరు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతిపథంలో దూసుకెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ”కొంతమంది యువకులు ముందుయుగం దూతలు /భావన నవజీవన బృందావన నిర్మాతలు” అని శ్రీశ్రీ అన్నట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతికత, వినూత్న నైపుణ్యాలను అందిపుచ్చుకుంటోంది ఈతరం యువత.
క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం… లేదా స్టార్టప్‌ పెట్టేయడం.. సక్సెస్‌ కొట్టేయడం… మీడియా కథనాలు చూస్తుంటే… మంచినీళ్ల ప్రాయమన్నట్టు తోస్తుంది… నిజానికి అది అంత సులభమా? అయితే ఇప్పటికే ఎంతమంది ఇంజినీరింగ్‌ చేసినవారు ఖాళీగా ఎందుకు ఉంటారు? అనే ప్రశ్నలు రాక మానవు. మీడియా కథనాలు వేరు… వాస్తవాలు వేరు. క్యాంపస్‌ ఇంటర్వ్యూలే చూడని కాలేజీలు మన రాష్ట్రంలోనే కోకొల్లలు. ఇక స్టార్టప్‌ల సంగతి సరేసరి. స్టార్టప్‌లు పెట్టి సక్సెస్‌ అయిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అత్యున్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోంది ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’. ఒక స్టార్టప్‌ లాంటి ఈ వేదిక ఏదైనా డిగ్రీ, ఆ పైన చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ తరం సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను అందజేస్తూ.. మరోవైపు పరిశ్రమలో వారికి అవకాశాలను చేరువ చేస్తోంది. 6 లక్షలకు పైగా స్టూడెంట్‌ నెట్‌వర్క్‌తో విభిన్న వేదికల్లో విద్యార్థులకు అవగాహన అవకాశాలను కల్పిస్తోంది. అలాంటి వాళ్లని ఇతర విద్యార్థులతో అనుసంధానించి… అద్భుతాలు చేస్తోంది ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’! ఫ్రెండ్‌షిప్‌తో పాటు స్కాలర్‌షిప్‌లూ అందించే అతిపెద్ద స్టూడెంట్‌ కమ్యూనిటీ ఇది!
ఎలా వచ్చిందీ ఆలోచన
‘ఎక్స్‌పోజర్‌…’ చిన్న పదమే కావచ్చు కానీ దాని ప్రభావం చాలా పెద్దది. విద్యార్థుల ఎదుగుదలలో అదే అత్యంత కీలకమైంది. వాళ్లవాళ్ల అభిరుచుల్లో ఎక్స్‌పోజర్‌ తప్పనిసరి. కానీ ఇలాంటి ఎక్స్‌పోజర్‌ హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో విద్యార్ధులకు దొరకొచ్చు. ఓ మోస్తరు నగరాల్లోనూ చదివే విద్యార్థులకి పర్వాలేదు అన్నట్టు ఉన్నా, అదే పట్టణాలూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదివేవాళ్లకి మాత్రం అందని దాక్షగానే ఉంది. పేరుకి డిగ్రీ చదువుతారు కానీ ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్‌ ఉండవు. అందువల్లే కంపెనీలేవీ వాళ్ల దగ్గరకి క్యాంపస్‌ ఇంటర్వ్యూకు రావు. ఇక స్టార్టప్‌లు పెట్టడానికో… ఇన్‌క్యుబేషన్‌లకో అవకాశమే ఉండదు! ఇన్ఫోసిస్‌ సంస్థ హెచ్‌ఆర్‌ నిపుణుడిగా ఇలాంటి కాలేజీలనీ విద్యార్థులనీ చూసిన మన హైదరాబాదీ యువకుడు శ్రీచరణ్‌ లక్కరాజుకి వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. తనకున్న అనుభవంతో- ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థని ఏర్పాటుచేసి కోచింగ్‌ క్లాసుల్లాంటివి పెడితే… బాగానే సంపాదించి ఉండేవాడేమో కానీ అతను అటు వెళ్లలేదు. బదులుగా- ఈ విద్యార్థుల్ని ‘మంచి ఎక్స్‌పోజర్‌’ ఉన్న ఇతర విద్యార్థులతో కలపాలనుకున్నాడు. కోచింగ్‌ క్లాసులు ఇవ్వలేని స్ఫూర్తిని ఫ్రెండ్‌షిప్‌ ఇస్తుందని భావించాడు! ఆ ‘నెట్‌వర్క్‌’ మంచి అద్భుతాలు చేస్తుందని నమ్మాడు! అలా- 2014లో ‘స్టూమ్యాగ్జ్‌’ అనే ఆన్‌లైన్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీని ప్రారంభించాడు. ప్రతి కాలేజీకీ వెళ్లి, విద్యార్థుల్ని కలిసి అక్కడ స్టూమ్యాగ్జ్‌ కమ్యూనిటీలని ఏర్పాటుచేశాడు. వాళ్లలో కాస్త రాయగలిగేవాళ్ల చేత వివిధ విద్యా ఉద్యోగావకాశాలకి సంబంధించిన అంశాలపైన వ్యాసాలు రాయించేవాడు. వాటితోపాటూ నిపుణుల ద్వారా ఇంటర్న్‌షిప్‌లూ ఉద్యోగావకాశాల వివరాలని అందిస్తుండేవాడు. ఈ సైట్‌ కోసమే ఇన్ఫోసిస్‌ ఉద్యోగాన్నీ వదిలేశాడు శ్రీచరణ్‌. ఈ సైట్‌తో ఆదాయం పెద్దగా రాదని అందరూ అంటున్నా… మా క్యాంపస్‌కి రావొద్దని కాలేజీ యాజమాన్యాలు కొన్ని మోకాలడ్డినా మొండిగానే ముందుకెళ్లాడు. మెల్లగా సైట్‌కి వచ్చే ప్రకటనలతో ఆదాయం రాసాగింది.
నాలుగో ఏట ఈ నెట్‌వర్క్‌లోని విద్యార్థుల సంఖ్య మూడులక్షలకి చేరింది! దాంతో ఫోర్బ్స్‌ సంస్థ తమ ’30 అండర్‌ 30′ జాబితాలో శ్రీచరణ్‌ పేరుని చేర్చింది. నెట్‌వర్క్‌లో ఉన్నవాళ్ల సంఖ్య ఐదు లక్షలకి చేరింది. అప్పుడే ఓ కొత్త పోకడకి శ్రీకారం చుట్టాడు శ్రీచరణ్‌. విద్యార్థులందరూ ప్రత్యక్షంగా కలిసే ఒరవడిని ప్రారంభించాడు. విద్యార్థుల దగ్గరికే పారిశ్రామికవేత్తలూ నిపుణులూ వచ్చి మాట్లాడేలా రకరకాల కార్యక్రమాలని రూపొందించాడు. పనిలో పనిగా తన సంస్థకి ‘స్టూడెంట్‌ ట్రైబ్‌’ అని పేరుమార్చాడు!
స్టూడెంట్‌ ట్రైబ్‌
స్టూడెంట్‌ ట్రైబ్‌ అనేది స్టూడెంట్‌ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌. విద్యార్థులను నైపుణ్యాలకు అనువైన బ్రాండ్స్‌కు అనుసంధానం చేస్తోంది. గిగ్‌ వర్క్‌ ఇంటర్నీషిప్‌, వలంటీర్‌, ఫుల్‌టైమ్‌గా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదన, స్కిల్స్‌ మెరుగు పర్చుకోవడంతో పాటు సర్టిఫికెట్లు పొందవచ్చు. స్థిరమైన భవిష్యత్‌ వద్ధికి అంతులేని అవకాశాలను సష్టిస్తోంది. టెక్నాలజీ నుంచి మార్కెటింగ్‌, డిజైన్‌ వరకు ప్రతి అవకాశాన్ని దగ్గర చేరుస్తోంది. 2022లో ప్రతి నెలా చివరి శనివారం విద్యార్థుల కోసం ‘ట్రైబ్‌ మీట్‌’లని ఏర్పాటుచేస్తున్నట్టు పిలుపునిచ్చాడు శ్రీచరణ్‌. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల కాలేజీల నుంచి కేవలం నలుగురే వచ్చారట! అయినా వెనకడుగు వేయలేదు. ఈసారి కాలేజీలకెళ్లి ఈ భేటీల గురించి ప్రచారం చేశాడు. దాంతో రెండో కార్యక్రమానికి మూడొందల మంది వచ్చారు. డ్రోన్స్‌, ఏఐ రంగాలకి చెందిన నిపుణుల్ని రప్పించి అక్కడున్న అవకాశాల గురించి చెప్పించాడు. సినిమా రంగంలోని వాళ్లని పిలిపించి అక్కడి సాధక బాధకాలని వివరించేలా చేశాడు. ఇది క్లిక్‌ అయ్యింది. ఆ తర్వాతి నెల నుంచి ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల హాజరు 1500 పైచిలుకే ఉంటోంది. రూ.11 ఎంట్రీ ఫీజుతో- ల్యాప్‌టాప్‌లూ మొబైళ్లూ అతితక్కువ ధరకి కొనేలా కూపన్‌లూ అందించడం మొదలుపెట్టారు. దీంతోపాటూ- స్టూడెంట్‌ ట్రైబ్‌ బృందంవాళ్లే వివిధ రంగాల నిపుణుల్ని తీసుకుని కాలేజీలకు వెళ్లే ‘ట్రైబ్‌ ఫెస్ట్‌’ అనే కార్యక్రమాలూ చేస్తున్నారు.
ఇక ‘ప్రోస్ట్‌’… ఏడాదికోసారి నిర్వహించే అతిపెద్ద విద్యార్థుల ఉత్సవం. స్ఫూర్తి, వినోదం, విజ్ఞానాల మేలుకలయికగా ఉండే ఈ కార్యక్రమానికి ఇటీవల పదివేల మంది విద్యార్థులు హాజరయ్యారు! ఈ ఉత్సవంలో ‘దియా స్కాలర్‌షిప్‌’ పేరుతో ఓ నిరుపేద విద్యార్థినికి రూ.50 వేలు సాయం అందిస్తారు! ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు… వీళ్లు నిర్వహించే ‘ఎస్టీ 33’ మరో ఎత్తు!
నైపుణ్య శిక్షణ…
ఈ వేదిక దాదాపుగా ఆరు లక్షలకు పైగా విద్యార్థులతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైగా కాలేజీలతో అనుసంధానమై ఉంది. సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్ట్రాగామ్‌లో 4.5 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. టైర్‌%-%2, టైర్‌%-%3నగరాల్లో సేవలు అందించడంతో పాటు వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. విద్యార్థులు సంపాదించిన డబ్బు అటు చదువు, ఇటు ప్యాకెట్‌ మనీకి ఉపయోగపడుతుంది. బ్రాండింగ్‌, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం అభివద్ధి అనే మూడు అంశాలపై సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక యాప్‌ ఆవిష్కరించి అవకాశాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్స్‌ తదితర కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందుపరుస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ వంటి ఏదైనా డిగ్రీ చేసిన విద్యార్థులు ఈ సేవలను ఉచితంగానే పొందవచ్చు.
గ్రామీణ విద్యార్థులకి సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిజైనింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ అందించే కార్యక్రమం అది. ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న నిపుణులే ఈ శిక్షణ అందిస్తారు. రూ.15 వేల నుంచి లక్ష రూపాయలదాకా ఫీజు ఉంటుంది. చక్కటి ప్రతిభ కనబరిచినవారికి మొత్తం ఫీజు తిరిగిచ్చేస్తారు. ప్రారంభించిన నాలుగునెలల్లోనే ఈ శిక్షణ ద్వారా 120 మంది విద్యార్థులకి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఏదేమైనా ఈ కార్యక్రమాల ద్వారా స్టూడెంట్‌ ట్రైబ్‌ సభ్యుల సంఖ్య ఆరున్నర లక్షలకి చేరింది. దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ స్టూడెంట్‌ కమ్యూనిటీగా గుర్తింపు సాధించింది! విద్యార్థులకి సంబంధించిన ఉత్తమ వేదికగా ఎన్నో అవార్డులూ అందుకుంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

Spread the love