Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబుధేరా గురుకుల కళాశాలలో విద్యార్థినుల ఆందోళన

బుధేరా గురుకుల కళాశాలలో విద్యార్థినుల ఆందోళన

- Advertisement -

నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రత, భద్రతపై ఫిర్యాదు
ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు లేఖ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

కళాశాల ప్రిన్సిపల్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని, నాణ్యత లేని ఆహారం వడ్డిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలు ఆందోళన చేట్టారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరాలోని తెలంగాణ ప్రభుత్వ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్క రించాలని కోరుతూ తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రత, భద్రతపై నిరసన వ్యక్తం చేయ డంతో పాటు నిత్యం ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు విద్యార్థి నులు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు మాట్లాడుతూ.. కళాశాలలో గత కొన్ని నెలలుగా నాణ్యత లేని ఆహారం, పారిశుద్ధ్య లోపాలు, వసతి సమస్యలు, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కళాశాలలో అందిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు కనిపిస్తున్నాయని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఆహారం తినలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు అందించిన సిలిండర్లు కూడా ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదని తెలిపారు. గతంలో సూర్యాపేట, షాద్‌నగర్ కళాశాలల్లో పనిచేసిన సమయంలోనూ సంబంధిత ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం పట్ల విద్యార్థులు ఆందోళనలు నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ తరచూ విద్యార్థినులను దూషిస్తూ, అవమానకరమైన , అనుచిత పదజాలంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో తామంతా మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో విద్యను కొనసాగించాల్సిన తమకు కళాశాలలో భయాందోళన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన కళాశాలల్లోనూ ఈ ప్రిన్సిపాల్ ప్రవర్తనకు వ్యతిరేకంగా విద్యార్థులు సమ్మె చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కళాశాలలోని పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహను విద్యార్థినులు వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -