– సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ కేఎస్‌కే జయదేవ్ రావు
– ‘సాయిస్ఫూర్తి’లో మోటివేషనల్ ప్రోగ్రాం
నవతెలంగాణ – సత్తుపల్లి
విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలని సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, యోగ ప్రాక్టీషనర్ కేఎస్‌కే జయదేవ్ రావు అన్నారు. సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్, డిప్లొమా, బీఫార్మసీ మొదటి సంవత్సరంలో చేరిన అన్ని బ్రాంచీల విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా గురువారం మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయదేవ్ రావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని, దాని సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మ విశ్వాసంతో అధిగమించాలని ఆయన కోరారు. సమయాన్ని వృథా చేయకుండా మైండ్ పవర్, ఆరోగ్య నిర్వహణ, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్‌పై దృష్టి సారించాలని సూచించారు.
తల్లిదండ్రులు, గురువుల గొప్పతనాన్ని స్మరిస్తూ నైతిక విలువలు, మానవీయ సంబంధాలు, సేవాగుణం కలగలిపిన వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఊటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… మంచి నడవడిక, ఆదర్శ భావాలు, మానవతా విలువలు, విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద విద్యార్థులతో వర్చువల్ సిస్టం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ఈ ఇండక్షన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి తెలిపారు.
కొత్తగా చేరిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ హ్యుమానిటీస్ హెచ్‌ఓడీ డాక్టర్ షేక్ మీరాసాహెబ్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, అన్ని విభాగాల హెచ్ఓడీలు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



