చీకట్లో చదువులు

Studies in the dark– యూపీలో 14 వేలకు పైగా స్కూళ్లకు కరెంటే లేదు
– డిజిటల్‌ బోధన అంటూ యోగి సర్కారు గొప్పలు
లక్నో : రాష్ట్రంలో డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల తరగతి గదిలో విద్యార్థులకు మరింత సమర్ధవంతంగా బోధించే అవకాశం కలుగుతుందని ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే యోగి ప్రభుత్వం మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. విద్యను డిజిటలీకరణ చేయాలంటే ముందు పాఠశాలలకు విద్యుత్‌ సదుపాయం తప్పనిసరి. కానీ రాష్ట్రంలోని 14,630 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కరెంటు సౌకర్యమే లేదు. వీటిలో గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో స్మార్ట్‌ తరగతులు, ఆన్‌లైన్‌ బోధన వంటివి అక్కడ సాధ్యపడడం లేదు.
ఇటీవల జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని వేలాది ప్రభుత్వ పాఠశాలలకు కనీసం విద్యుత్‌ సదుపాయం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఫ్యాన్లు, లైట్లే లేనప్పుడు ఇక డిజిటల్‌ బోధనకు అవకాశం ఎలా ఉంటుంది? కొన్ని పాఠశాలల దరిదాపుల్లో ఎలక్ట్రిక్‌ స్తంభాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాఠశాలలకు త్వరలోనే విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తోంది. రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ప్రయాగరాజ్‌లో 309, ప్రతాప్‌ఘర్‌లో 406, ఫతేపూర్‌లో 405 పాఠశాలలకు విద్యుత్‌ సదుపాయం లేదు. ఉత్తరప్రదేశ్‌లో వాతావరణం వేడిగా ఉంటుంది. దీనికితోడు కరెంటు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు చెమటలు కక్కుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తోంది.
చలికాలంలో అయితే పాఠశాలలు తెరచిన కొద్ది సమయం వరకూ విపరీతమైన చలిగా ఉంటుంది. పైగా మంచు పడుతుండడంతో తరగతి గదిలో చీకటి వాతావరణం అలముకొని ఉంటుంది. ఫలితంగా విద్యా బోధన సాగడం లేదు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు సమీక్షలు జరుపుతూ కొద్ది మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదు.
గ్రామీణ ప్రాంతాలలోని మూడు వేలకు పైగా పాఠశాలల సమీపంలో విద్యుత్‌ స్తంభాలే లేవు. కొన్ని పాఠశాలలకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే విద్యుత్‌ స్తంభం కన్పిస్తుంది. 123 పాఠశాలలకు అయితే నాలుగైదు కిలోమీటర్ల దూరం వరకూ విద్యుత్‌ స్తంభాలు లేవు.
పోనీ స్తంభాలు ఉన్న చోట అయినా పాఠశాలలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారా అంటే అదీ లేదు. గ్రామీణ ప్రాంతాలలో రోజుకు కనీసం 18 గంటలు కరెంట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే పాఠశాలలు పని చేసే సమయంలో సైతం కరెంట్‌ ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

Spread the love