నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత సర్వే సిబ్బందికి సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు.
బేతుపల్లి గ్రామానికి సంబంధించిన రీ-సర్వే ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా పర్యవేక్షించారు. సర్వే రికార్డులను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ చేసే సమయంలో కచ్చితత్వంతో రికార్డుల నవీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రీ-సర్వే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కోరారు.



