ఇజ్రాయిల్‌కు యుద్ధ సామగ్రి సరఫరా

ఇజ్రాయిల్‌కు యుద్ధ సామగ్రి సరఫరా– రాకెట్లు, పేలుడు పదార్థాలు విక్రయించిన భారత్‌
– ఒకవైపు చర్చల ద్వారానే ఘర్షణలను నివారించుకోవాలంటూ సుద్దులు
– మరోవైపు యుద్ధ సామగ్రిని చేరవేస్తూ అగ్నికి ఆజ్యం
– మోడీ సర్కార్‌ ద్వంద్వ నీతి
న్యూఢిల్లీ : గాజాలోని పాలస్తీ నీయులపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం యుద్ధ సామగ్రిని విక్రయించింది. సరకు రవాణా నౌకల ద్వారా రాకెట్లు, పేలుడు పదార్థాలు చేరవేసింది. ఇవి గాజా స్ట్రిప్‌కు 30 కిలోమీటర్ల దూరంలో గల ఇజ్రాయిల్‌లోని అష్‌దాద్‌ ఓడరేవుకు చేరాయని అల్‌ జజీరా తెలిపింది. ఏప్రిల్‌ 2న చెన్నరు నుండి బయలుదేరిన నౌక హౌతీల దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రం ద్వారా కాకుండా ఆఫ్రికా మీదుగా ఇజ్రాయిల్‌ చేరుకుంది. యుద్ధ సామగ్రి రవాణాకు సంబంధించిన కీలక పత్రాలు అల్‌ జజీరాకు లభించాయి.
బార్కమ్‌ పేరుతో ఉన్న ఈ నౌకలో 20 టన్నుల రాకెట్‌ ఇంజిన్లు, 12.5 టన్నుల బరువున్న పేలుడు స్వభావం కలిగిన రాకెట్లు, 1500 కిలోల పేలుడు పదార్థాలు, 740 కిలోల ప్రమాదకర వాయువులు ఉన్నాయి. యుద్ధ సామగ్రి ఇజ్రాయిల్‌కు, దాని రక్షణ సంస్థ ఐఎంఐ సిస్టమ్స్‌కు సరఫరా అవుతున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదని నౌకలోని ఉద్యోగులు, కన్సల్టెంట్లకు ఆదేశాలిచ్చారు. అందుకే ఈ ఓడలో ఇజ్రాయిల్‌కు ఆయుధాలు కానీ, ఇతర సామగ్రి కానీ రవాణా కాలేదని దాని వాణిజ్య మేనేజర్‌ సంస్థ బుకాయించింది. భారత్‌ నుంచి బయలుదేరిన రెండో నౌకను మే 21న స్పెయిన్‌లోని కార్టాజనా ఓడరేవులోకి అనుమతించలేదు. ఈ నౌక చెన్నరు నుండి 27 టన్నుల పేలుడు పదార్థాలతో ఇజ్రాయిల్‌లోని హైఫా ఓడరేవుకు బయలుదేరిందని స్పెయిన్‌ పత్రిక తెలిపింది. ఇజ్రాయిల్‌కు యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తున్నందునే తమ ఓడరేవులోకి అనుమతి నిరాకరించామని స్పెయిన్‌ విదేశాంగ మంత్రి తెలిపారు. చర్చల ద్వారానే ఘర్షణలను నివారించుకోవాలని సుద్దులు చెబుతున్న భారత్‌ ఈ విధంగా ఇజ్రాయిల్‌కు యుద్ధ సామగ్రిని చేరవేసి అగ్నికి ఆజ్యం పోయడాన్ని శాంతి కాముకులు గర్హించారు. కొన్ని సంవత్సరాలుగా భారత్‌, ఇజ్రాయిల్‌ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు జెయిన్‌ హుస్సేన్‌ చెప్పారు. ఈ నెల 6న గాజా లోని ఐరాస శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్‌ బాంబు దాడి జరిపింది. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు జారవిడిచిన ఓ క్షిపణి శకలాలపై ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే లేబుల్‌ కన్పించింది. ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణులను ఇజ్రాయిల్‌ కోసం అభివృద్ధి చేశామని మన దేశానికి చెందిన ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అంగీకరించారు. భారత్‌-ఇజ్రాయిల్‌ భాగస్వామ్యం రాకెట్‌ ప్రొపెల్లర్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్‌ సిస్టమ్స్‌తో కలిసి అదానీ గ్రూపు మానవ రహిత గగనతల వాహక కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Spread the love