ఎస్‌బీఐకి సుప్రీం షాక్‌

Supreme shock for SBI– నేటి సాయంత్రానికి ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే
– 26 రోజులు ఏం చేశారు?
– గడువు పొడిగించే ప్రశ్నే లేదు
– ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవుొ 15న వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి ఆదేశం
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల వివరాలు అందజేసేందుకు జూన్‌ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని కోరుతూ ఎస్‌బీఐ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తాను ఆదేశాలు జారీ చేసి 26 రోజులు గడిచాయని, ఇప్పటి వరకూ ఏం చేశారని నిలదీసింది. మంగళవారం బ్యాంక్‌ పనివేళలు ముగిసే లోగా ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఎస్‌బీఐ ఇచ్చిన వివరాలను ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించేందుకు మరింత గడువు ఇవ్వాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవారు, జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించని ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), సీపీఐ (ఎం) సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
‘గత నెల 15వ తేదీన మేము తీర్పు ఇచ్చాము. విరాళాల వివరాలు అందజేయాలని మిమ్మల్ని ఆదేశించాం. ఇవాళ మార్చి 11వ తేదీ. మీరు మరింత సమయం కోరుతూ న్యాయస్థానానికి రావడం చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే మేము ఇచ్చిన తీర్పు స్పష్టంగానే ఉంది. గత 26 రోజులుగా మీరు చేపట్టిన చర్యల వివరాలు మీ దరఖాస్తులో లేవు’ అని ధర్మాసనం ఎత్తిచూపింది. ఎస్‌బీఐ తన వద్ద ఉన్న సీల్డ్‌ కవరును తెరిచి, అందులోని వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను పాటించకపోతే ధిక్కరణ చర్యలు చేపడతామని కూడా హెచ్చరించింది. ఎస్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. విరాళాలు ఎవరు ఇచ్చారు, ఏ పార్టీకి ఇచ్చారు అనే సమాచారాన్ని సరిపోల్చాలంటే సమయం పడుతుందని, ఎందుకంటే ఆ సమాచారాన్ని వేర్వేరుగా భద్రపరచడం జరిగిందని ఆయన కోర్టుకు తెలియజేశారు. ‘తప్పులు చేసి గందరగోళం సృష్టించాలని మేము అనుకోవడం లేదు. మాకు కొంత సమయం ఇవ్వండి. మేము ఆ పనిని పూర్తి చేస్తాం’ అని అభ్యర్థించారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకుంటూ పొరబాటు జరిగే అవకాశమే లేదని అన్నారు. ‘మీ వద్ద కేవైసీ ఉంది. మీది దేశంలోనే నెంబర్‌ వన్‌ బ్యాంక్‌. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారన్న విశ్వాసం మాకు ఉంది’ అని చెప్పారు. సమాచారాన్ని సరిపోల్చాలని న్యాయస్థానం తన తీర్పులో చెప్పలేదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ గుర్తు చేశారు. ఎస్‌బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెల్లడించాలని మాత్రమే తాను కోరామని తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవరించాలంటూ బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోరిన సమాచారం ఇప్పటికే బ్యాంక్‌ వద్ద ఉన్నదని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే తాజా ఆదేశాలను పాటించని పక్షంలో ఉద్దేశపూర్వకంగా అవిధేయత ప్రదర్శించినందుకు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది.

Spread the love