డిజిటల్‌ లావాదేవీలపై నిఘా

Surveillance of digital transactions– బ్యాంకు ఖాతాలపై దృష్టి
– రోజువారీ సమాచారం సేకరిస్తున్న అధికారులు
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
డిజిటల్‌ లావాదేవీలపై ఎన్నికల అధికార యంత్రాంగం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో తమ ప్రయత్నాలు ప్రారంభించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా ఆదాయ పన్ను, పోలీస్‌ శాఖల అధికారులు బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు.
ఎన్నికల ప్రచారంతో ఓటర్లను ప్రలోభ పెట్టే క్రమంలో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల తనిఖీలూ మరింత తీవ్రమయ్యాయి. డబ్బుల తరలింపు కష్టతరం అవుతున్న నేపథ్యంలో ముఖ్య నేతలకు, ఓటర్లకు బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ లావాదేవీల ద్వారా చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డిజిటల్‌ లావాదేవీలు పరిమితికి మించి జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు యూపీఐ, బ్యాంకు ఖాతాలపై కూడా నిఘా పెంచారు. డిజిటల్‌ లావాదేవీలను పరిశీలించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు సేవింగ్‌, కరెంట్‌ ఖాతాలతో పాటు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలపై కూడా నిఘా పెట్టారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో పాటు పరిమితికి మించిన లావాదేవీలు నిర్వహించే ఖాతాల వివరాలను ఎన్నికల సంఘం ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేయనుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు వందకు పైగా ఉన్నాయి. ఈ బ్యాంకుల్లోని ఖాతాలపై ఆదాయపు పన్ను, పోలీసు శాఖల అధికారులు నిఘా ఉంచారు. ముఖ్యంగా జీరో బ్యాలెన్స్‌ ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సాధారణంగా బ్యాంకుల్లో 49వేల లోపు నిర్వహించే లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. 50వేల పైన నిర్వహించే లావాదేవీలకు తప్పనిసరిగా పాన్‌ కార్డు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమానం కలిగినా సంబంధిత ఖాతాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. లక్ష రూపాయలకు మించి లావాదేవీలు జరిగే ఖాతాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, ఆసరా పింఛన్‌దారుల ఖాతాలపైన ఆరా తీస్తున్నారు.

Spread the love