మణిపూర్‌లో అనుమానిత ‘ఉగ్ర’దాడి

– నలుగురు కమాండోలు, ఒక బీఎస్‌ఎఫ్‌ జవానుకు గాయాలు
ఇంఫాల్‌ : మణిపూర్‌లోని తెంగ్నౌపాల్‌ జిల్లాలోని కుకీ-జోమి ఆధిపత్య సరిహద్దు పట్టణం మోరే సమీపంలో అనుమానిత ఉగ్రవాదుల దాడిలో భద్రతా దళాలకు చెందిన కనీసం ఐదుగురు గాయపడ్డారు. డిసెంబరు 30న పోలీసులపై మరో ఆకస్మిక దాడి జరగటంతో పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత పట్టణంలో కర్ఫ్యూ విధించారు. డిసెంబర్‌ 30న హింసాకాండలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్న తర్వాత తాజా దాడి చోటు చేసుకోవటం గమనార్హం. మంగళవారం జరిగిన కాల్పుల్లో నలుగురు రాష్ట్ర పోలీసు కమాండోలు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సభ్యుడు గాయపడ్డారని పోలీసు అధికారి చెప్పారు. గాయపడిన వారిని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స కోసం ఇంఫాల్‌కు విమానంలో తరలించినట్టు తెలిపారు. మణిపూర్‌లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య మే ప్రారంభం నుంచి జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి 200 మందికి పైగా మరణించారు. దాదాపు 67,000 మంది ప్రజలు తమ ఇండ్లను విడిచిపెట్టవలసి వచ్చింది.

Spread the love