శిధిలావస్థకు చేరిన తానాకుర్ధి చెక్ డ్యాం

– రైతుల పరిస్థితి అయోమయం

నవతెలంగాణ – మోపాల్ 

మోపాల్ మండలంలోని తనకుర్ధి గ్రామంలో గల చెక్ డ్యాం కూలిపోయే పరిస్థితి వచ్చింది. గ్రామంలో చెక్ డ్యాం నిర్మించినప్పటి నుండి ఇక్కడి  గ్రామ ప్రజలకు సాగునీటి కష్టాలు, త్రాగునీటి కష్టాల నుంచి విముక్తి పొందారు. దాదాపు 100 ఎకరాలకు పైబడి  వ్యవసాయ సాగుకు  ఈ చెక్ డ్యాం లో నీరు నిల్వ ఉండటం వల్ల బోరు బావులు ఎండిపోకుండా  వేసవికాలం అయిన బోరు బావుల్లో నీటి నిల్వ ఉండే విధంగా కాపాడుతుంది. మండలంలో మిగతా గ్రామాల్లో నీటి ఎద్దటి ఎదురైన ఈరోజు కూడా తనకుర్ధి గ్రామంలో సాగు చేయడానికి కానీ మరియు గ్రామంలో తాగునీటి ఎద్దడికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చెక్ డ్యాం కాపాడుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం లో డి .శ్రీనివాస్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ చెక్ డ్యాం నిర్మించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. కానీ రాను రాను దానికి మరమ్మత్తులు చేయలేకపోవడం వల్ల రోజురోజుకు దెబ్బ తింటూ ఆఖరికి మొత్తం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మోపాల్ మండలంలోని నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వస్తారు వెళ్తారు తప్ప సరైన నివేదిక తయారు చేయడంలో ఉన్నత అధికారులు దృష్టికి తీసుకు వెళ్లడంలో మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. యే గ్రామంలోనైనా మొట్టమొదటిగా గ్రామస్తులు కోరుకునేది నీటి సదుపాయాల గురించి మాత్రమే అటువంటి చెక్ డ్యాం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తానాకుర్ధి గ్రామంలోని ప్రజలందరీ జీవనోపాధి వ్యవసాయం పైననే ఆధారపడి ఉంటుంది.  ఈ చెక్ డ్యాం లో నీటి నిల్వ ఉన్నందున  కొందరు చేపలు పట్టే మచ్చకారులకు కూడా జీవనోపాధి కలుగుతుంది. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తమ గ్రామం పై దయచూపి కొత్త చెక్ డ్యామ్ ని మంజూరు చేసి తమ గ్రామ సమస్యను తీర్చాలని ఎల్లప్పుడూ తమ గ్రామం వారికి రుణపడి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
రైతు గంగాధర్ మాట్లాడుతూ తమ గ్రామం యొక్క జీవన ఉపాధి మొత్తం ఈ చెక్ డాం పైన ని ఆధారపడి ఉంటుందని ఒకవేళ చెక్ డాం మొత్తం కూలిపోతే తమ బోర్లలో ఒక చుక్క నీరు కూడా నిల్వ ఉండకుండా పొలాల్లో ఉండే బోరుబావులన్నీ ఎండిపోతాయని, గ్రామంలో కూడా తాగడానికి నీరు కూడా దొరకకుండా పోతుందని ముందే వేసవికాలంలో ఇప్పటికే చాలా గ్రామాలలో నీటి కొరత ఎదుర్కొంటున్న, తమ గ్రామంలో చెక్ డాం కట్టిన రోజునుండి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉంటూ అలాగే గ్రామంలో కూడా ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండేది తాగడానికి ఏ రోజు కూడా ఇబ్బంది పడే వాళ్ళం కాదు. దయచేసి నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు మరియు ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  తమకు కొత్త చెక్ డ్యామ్ మంజూరు చేసి తమ గ్రామాన్ని ఆదుకోవాలని చిరస్థాయిలో అయిన పేరును మా గ్రామస్తులు గుర్తు పెట్టుకుంటాం అని తెలిపారు. ఇప్పటికైనా గ్రామస్తుల బాధలు తీర్చాలని నవతెలంగాణ ఉన్నత అధికారులను మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తుంది
Spread the love