– హాంకాంగ్ ఓపెన్
కౌలూన్(హాంకాంగ్): హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో తానీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీ రెండోరౌండ్‌కు దూసుకెళ్లగా మిగిలిన షట్లర్లందరూ పరాజయాన్ని చవిచూశారు. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలిరౌండ్ పోటీలో భారత జంట 21-19, 21-19తో చైనీస్ తైపీకి చెందిన లీ-టెంగ్‌లను చిత్తుచేశారు. ఇక పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్ గరగ-విష్ణువర్ధన్ జోడీ 15-21, 15-21తో కో-సంగ్, షిన్ బెక్(కొరియా) చేతిలో వరుససెట్లలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో బి.సుమిత్-అశ్విని పొన్నప్ప జంట 16-21, 21-16, 18-21తో అమెరికాకు చెందిన ఛెన్-టంగ్, టో-ఇ-వురు చేతిలో పోరాడి ఓడగా.. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్ 14-21, 12-21తో జంగ్-యి-మన్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రియాంశురాజ్‌వత్ 13-21, 14-21తో జపాన్‌కు చెందిన సునేయమా చేతిలో, మహిళల సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్ 18-21, 10-21తో వున్నే-లీ(జర్మనీ) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి జోడీ 19-21, 10-21తో సింగపూర్ జంట చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఇక పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు.