2029 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల కసరత్తు
టీడీపీ, జనసేనకు రాష్ర్టంలో చోటు కల్పించేందుకు బీజేపీ యత్నం
టీడీపీ కేడర్ తనవెంటే ఉండేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలు
దానిలో భాగమే అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
రేపు హైదరాబాద్‌లో పవన్‌కళ్యాణ్ జనసాదక్ సమ్మేళనం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకోసం సన్నద్ధం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ర్టంలో 2029 ఎన్నికల కోసం రాజకీయ వ్యూహాలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఒంటరిగా తాము అధికారంలోకి రాలేమనే విషయం ఆపార్టీ అధినేతలకు స్పష్టంగా తెలుసు. పొరుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు తెలంగాణలో స్థానం కల్పించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను పోటీ చేయించి, బలాబలాలు అంచనా వేయాలని వ్యూహరచన చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రావతరణ రోజైన జూన్ 2వ తేదీ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ పేరుతో ఓ సభను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తనపార్టీ కేడర్‌ను సిద్ధం చేయడమే ఈ సభ ఉద్దేశ్యమని తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో టీడీపీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని ఇటీవలి మహానాడులో తీర్మానం చేశారు. దానిలో భాగంగా రాష్ష్ర్టంలో ఆపార్టీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌తో పాటు టీడీపీ ఓట్లను కూడా రాబట్టడంలో సక్సెస్ అయ్యి, అధికారాన్ని దక్కించుకున్నారు. అయితే టీడీపీ కేడర్ బీజేపీవైపు మళ్లకుండా తనవెంటే ఉండేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల అమీర్‌పేటలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాన్ని వ్యతిరేకించిన బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలే చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేయాలనేది వ్యూహంగా కనిపిస్తుంది.
అదే సమయంలో టీడీపీ కేడర్‌కు దగ్గరగా ఉంటూనే, ప్రభుత్వ నెగటివ్ ఓట్‌బ్యాంక్‌ను చీల్చడం కోసం తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్)ని వాడుకోవాలనేది రేవంత్‌రెడ్డి వ్యూహంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే వారంతా బీఆర్ఎస్‌లో చేరడంతో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. ఆ ఎన్నికల్లో ఆపార్టీకి 28,28,492 ఓట్లు వచ్చాయి. 2018లో కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టి పోటీ చేసినా బీఆర్ఎస్ ముందు నిలబడలేకపోయింది. అయితే అప్పుడు కూడా టీడీపీకి తెలంగాణలో 7,27,714 ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో ఆపార్టీ పోటీచేయలేదు. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్‌కు మళ్లడంతో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా ఆపార్టీలను కాపాడుకోవడం, నిలబెట్టుకోవడంపైనే ఇప్పుడు ఆయా పార్టీల అధినేతలతో పాటు కాంగ్రెస్‌కూడా తాపత్ర యపడుతోంది. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తెలంగాణలో పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరి లాంటి అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. కొన్నేళ్లుగా టీడీపీ, జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితం అయినా, 2024లో ఏపీలో అధికా రంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. దీనితో ఇప్పుడు ఆపార్టీల దృష్టి తెలంగాణపై పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి, మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే, ఆ ఊపు తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందనే ధీమా ఆపార్టీల్లో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా ఆంధ్రాఓటర్ల నాడిని పట్టేందుకు తహతహలాడుతున్నాయి.



