ఈ ఏడాది నుంచి కొత్త ఫీజు రీయంబర్స్ మెంట్ విధానం
బకాయిలు పెండింగ్ పడకుండా చెక్ పెట్టేందుకు నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెండింగ్ బకాయిల సమస్యను అధిగమించేందుకు ఈ ఏడాది నుంచి కొత్త ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా రూ.200 కోట్లు విడుదల చేసి బకాయిల సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. 2007-08లో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల అమలులో సంవత్సరాలుగా కొనసాగుతున్న జాప్యాలు, పెండింగ్ బకాయిల సమస్యలకు ముగింపు పలకాలని భావిస్తున్నది. ప్రతి నెలా రూ.200 కోట్లు విధిగా విడుదల చేయడం ద్వారా కొత్త విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానంలో ‘ఫస్ట్ అప్లై – ఫస్ట్ రిలీజ్’ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లా సంక్షేమ అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఆమోదించిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు), వికలాంగ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. వివిధ సంక్షేమ శాఖలు ఇప్పటికే తమ ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. ఆర్థిక శాఖతో పాటు ముఖ్యమంత్రి తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. అనంతరం అధికారికంగా ఈ విధానాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్ సమస్య గత కొన్నేళ్లుగా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు తదుపరి సంవత్సరంలో విడుదల కావడం, అది కూడా పూర్తి స్థాయిలో జరగకపోవడంతో బకాయిలు ఐదేళ్ల వరకు పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వ సహాయంపై ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సుమారు రూ.7 వేల కోట్ల పెండింగ్ బకాయిలనుట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అంచనా ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలతో కలిపి మొత్తం బకాయిలు రూ.10 వేల కోట్లకు పైగా ఉంటాయని చెబుతున్నారు.
ప్రయివేటు కళాశాలల ఆందోళనలు
బకాయిల చెల్లింపుల కోసం ప్రయివేటు విద్యాసంస్థలు పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. 2025లో తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాలు గతేడాది సెప్టెంబర్ 15 నుంచి నిరవధికంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చల అనంతరం రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి గతేడాది అక్టోబర్ 1న సుమారు రూ.300 కోట్లు విడుదల చేసింది. దసరా సమయంలో మళ్లీ నిరసనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం మరో రూ.200 కోట్లు విడుదల చేసింది. అయినప్పటికీ, తాము డిమాండ్ చేసిన రూ.1,500 కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ.500 కోట్లే అందాయని, ఇంకా రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి.
విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఆలస్యంగా విడుదల కావడంతో అనేక మంది విద్యార్థులు ట్యూషన్ ఫీజులను స్వయంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చదువు పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. బకాయిలు చెల్లించకపోతే డిగ్రీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వలేమని కొన్ని ప్రయివేటు కళాశాలలు తెల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇటీవల జోక్యం చేసుకుని, 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పెండింగ్ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 24న జరగనుంది. మరోవైపు ప్రభుత్వం, ప్రతి నెలా నిధుల విడుదల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో విశ్వాసం పెరుగుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.



