– మండల ఉద్యాన శాఖ అధికారి రాకేష్
నవతెలంగాణ – పెద్దవంగర
రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో సాగుచేస్తున్న కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు సూచించిన మెళకువలను పాటిస్తే అధిక దిగుబడి, లాభాలను సాధించవచ్చునని మండల ఇంచార్జి ఉద్యాన శాఖ అధికారి రాకేష్ అన్నారు. మంగళవారం రామచంద్రు తండాకు చెందిన రైతు జాటోత్ దామోదర్ నాయక్ సాగు చేస్తున్న కూరగాయల పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల సాగుకు రైతులు ఆసక్తి చూపాలన్నారు. కూరగాయలు సాగు తో నిత్యం ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు ఆయా పంటల్లో చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా 953 ఎకరాల్లో మామిడి సాగు, 168 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు, 143 ఎకరాల్లో ఇతర పండ్ల తోటల సాగు, 384 ఎకరాల్లో మిరప, 46 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని చెప్పారు. ఉద్యానవన పంటల సాగులో అధిక దిగుబడులను, లాభాలను ఏవిధంగా సాధించాలో రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు జాటోత్ సునిత, యాకయ్య, నగేష్, కిష్టు తదితరులు పాల్గొన్నారు.