
నవతెలంగాణ హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో “పుస్తకాలతో హాయ్ హాయ్… స్మార్ట్ ఫోన్లకు బై బై” నినాదంతో పిల్లల లైబ్రరీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలోత్సవం ప్రతినిధులు మాట్లాడుతూ, నేటి యుగంలో చిన్నారులు మొబైల్ స్క్రీన్లలో మునిగిపోతున్నారు. టాబ్లెట్లు, ఫోన్లు చిన్నారుల చేతుల్లో పట్టాలుగా మారాయి. దీని వల్ల ఊహాశక్తి తగ్గిపోతోంది, ప్రశ్నించే ధోరణి మందగిస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ, పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో బాలోత్సవం చిల్డ్రన్స్ లైబ్రరీను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ గ్రంథాలయంలో అన్ని భాషల్లో పిల్లలకు అనువైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో సైన్స్, సాహిత్యం, కథలు, జీవిత గాథలు, విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించే అనేక గ్రంథాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇతర భాషలలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వారం ప్రత్యేక కథా సమాహారాలు, పఠన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లైబ్రరీ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు, ఆదివారం లేదా సెలవు రోజులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
“తల్లిదండ్రులు తమ పిల్లలకు కథలు చదివించాలి, వారిని గ్రంథాలయాలకు తీసుకెళ్లాలి. విజ్ఞాన ప్రపంచంతో వారిని పరిచయం చేయాలి. స్నేహితులతో కలిసి కూర్చొని చదివే అనుభూతి వారికి కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది” అని బాలోత్సవం సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 23, 2025, ఆదివారం ఉదయం11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లైబ్రరీ ప్రారంభోత్సవం జరగనుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, విద్యాసంస్థలు లైబ్రరీ ప్రారంభానికి హాజరై, పఠన సాంస్కృతిని ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎన్. సోమయ్య, ఉపాధ్యక్షురాలు కె. సుజావతి, నవీన్, బ్రహ్మణి, రజిత, జ్ఞానదీప్ పాల్గొన్నారు.