సెప్టెంబర్‌ 15న టెట్‌

https://tstet.cgg.gov.in– 27న ఫలితాలు విడుదల
– నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– వాటి సమర్పణకు తుది గడువు 16
– నోటిఫికేషన్‌ విడుదల
– దరఖాస్తు ఫీజు రెట్టింపు
– రూ.200 నుంచి రూ.400కు పెంపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవసేన, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌, టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని  తెలిపారు. వాటి సమర్పణకు తుది గడువు ఈనెల 16 వరకు ఉందని స్పష్టం చేశారు. టెట్‌ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 15న టెట్‌ రాతపరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తామని వివరించారు. అదేరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్షలుంటాయని తెలిపారు. అదేనెల తొమ్మిది నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 27న ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుందనీ, జనరల్‌ అభ్యర్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు 40 శాతం (60 మార్కులు) సాధించాలని తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే టెట్‌ దరఖాస్తు ఫీజును విద్యాశాఖ రెట్టింపు చేసింది. రూ.200 ఉన్న ఫీజును రూ.400కు పెంచింది. బుధవారం నుంచి ఈనెల 16 వరకు ఫీజు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో మరోసారి టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టెట్‌ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఇతర వివరాలకు https://tstet.cgg.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రంలో నాలుగోసారి టెట్‌
రాష్ట్రంలో మూడుసార్లు టెట్‌ రాతపరీక్షలను విద్యాశాఖ నిర్వహించింది. ఇప్పుడు ప్రకటించిన దాంతో నాలుగోసారి నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరిసారిగా గతేడాది జూన్‌ 12న టెట్‌ను నిర్వహించారు. పేపర్‌-1కు 3,51,476 మంది దరఖాస్తు చేయగా 3,18,444 మంది పరీక్ష రాశారు. వారిలో 1,04,078 (32.68 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్‌-2కు 2,77,893 మంది దరఖాస్తు చేస్తే, 2,50,897 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే బీఎడ్‌, డీఎడ్‌ ఉత్తీర్ణతతోపాటు తప్పనిసరిగా టెట్‌ పాస్‌ కావాలన్న నిబంధన ఉన్నది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీని కల్పిస్తున్నారు. అంటే టీఆర్టీ రాతపరీక్షకు 80 శాతం మార్కులు, టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి రెండింటిలో మెరిట్‌ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే టెట్‌కు ప్రాధాన్యత నెలకొంది. 2011 నుంచి టెట్‌ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను గతంలోనే విడుదల చేసింది. ఇంకోవైపు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులూ అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
టెట్‌ నోటిఫికేషన్‌ వివరాలు వివరాలు తేద నోటిఫికేషన్‌ విడుదల ఆగస్టు 1న
ఫీజు చెల్లింపు ఆగస్టు 2 నుంచి 16 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 2 నుంచి 16 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ సెప్టెంబర్‌ 9 నుంచి
రాతపరీక్ష సెప్టెంబర్‌ 15న
పేపర్‌-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12
పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5
ఫలితాలు సెప్టెంబర్‌ 27న

Spread the love