కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రగిలిన ఆదిపత్య పోరు

– సర్ది చెప్పిన ఎమ్మెల్యే మందుల సామేల్..
నవతెలంగాణ – నూతనకల్
ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మండల కేంద్రంలో నిర్వహించే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారానికి సంబంధించిన దిశా నిర్దేశం కోసం శనివారం మండల కేంద్రంలోని ఎర్ర పహాడ్ ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని నేడు నిర్వహించే  భారీ బైక్ ర్యాలీని, రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. కాగా సమావేశ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి అహర్నిశలు శ్రమించిన వారిని వదిలేసి, నిన్న మొన్న పార్టీలో చేరిన వారిని ఆహ్వానించడంతో కార్యకర్తలు అసహనానికి గురై ఇదెక్కడి న్యాయమని నిన్న మొన్న  పార్టీలోకి వచ్చిన వారికి అతిధి మర్యాదలు ఇస్తున్నారు.పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడి, అహర్నిశలు శ్రమిస్తూ కేసులపాలై ఎన్నో బాధలను అనుభవించిన నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీలోకి కార్యకర్తలను తప్ప ఏ ముఖ్య నాయకులను తీసుకోవద్దని అప్పటికే మండలంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నా ,ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంతోపాటు వారికే వేదికపై స్థానం కల్పిస్తున్నారని పార్టీ కోసం శ్రమించిన వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధలను అనుభవించింది మేమే, అధికారంలోకి వచ్చిన తర్వాత బాధపడేది మేమేనా, అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ    గోడును, రోధనను, ఆవేదనను  వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో వర్గ పోరు చోటు చేసుకుందని దానికి కారణం ఇతరా పార్టీల నుంచి వచ్చే నాయకులను పార్టీలో చేర్చుకోవడమేనని పార్టీ కార్యకర్తలు , ప్రజలు ఆందోళన చెందుతూ ఈ ఆధిపత్య వర్గ పోరు ఇలానే కొనసాగినట్లయితే పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని,ఈ పార్టీ నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులు వేరే పార్టీకి దారి చూసుకోక తప్పదనే  ఆలోచనలు లేకపోలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా  శాసనసభ్యులు మందుల సామేల్ ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదని పార్టీలో ఉన్న, శ్రమించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఎవరు ఎలాంటి వర్గ పోరుకు అవకాశం ఇవ్వకూడ ధని, కార్యకర్తలంతా ఒకే మార్గంలో పయనించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.దీనితో ఘర్షణ సర్దుమరిగింది. అనంతరం మిర్యాల  గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య, దరిపల్లి వీరన్న ల ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,సీనియర్ నాయకులు గుడిపాటి నరసయ్య,రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి వివేక్ రెడ్డి, స్థానిక మండల అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి,మద్దిరాల మండల అధ్యక్షులు అవిలమల్లు,ఎన్నికల కోఆర్డినేటర్ అభిషేక్ రెడ్డి, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగమ్ జయసుధ సుధాకర్ రెడ్డి,స్థానిక ఎంపీటీసీ పన్నాల రమా మల్లారెడ్డి,జిల్లా,మండల స్థాయి నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ,కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love