బీజేపీ విధానాలతో బీడీ పరిశ్రమ కుదేలు

With BJP policies Beedi industry is a donkeyదేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీ బీజేపీ. మూడోసారి అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతున్నది. మోడీ ఈ పదేండ్ల పాలనలో కుదేలైన రంగాల్లో బీడీ పరిశ్రమ ఒకటి. అందులో పనిచేసే వారికి గ్రాట్యూటీ, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, వంటి చట్టబద్ధ సౌకర్యాలున్నా అమలు నోచని పరిస్థితి. బీడీ పరిశ్రమలో కార్మికులకు నేడు పని లేదు. ఏ కార్ఖానాలో పని దినాలు ఏ రకంగా ఉంటాయో తెలియదు. అంటే నెలలో ఎన్ని రోజుల పని ఉంటుందనేది అంచనాకు రాలేము. ఉన్ననాడే పని లేని నాడు పస్తులే అన్నట్టు ఉంటుంది బీడీ కుటుంబాల పరిస్థితి. అంతే కాదు వారికి ఆకు సమస్య, తంబాకు సమస్య వంటివి కోకొల్లలు. వీటి గురించి పట్టించుకునే వారెవ్వరూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిశ్రమలో ఉపాధిలేమి విలయతాండవం చేస్తున్నది. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏ కార్ఖానా ఎప్పుడు మూతపడుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
దేశం మొత్తంలో కోటిన్నరమంది బీడీ పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలతో పరిశ్రమలు కునారిల్లుతున్నవి.బీడీ కట్టలపై డేంజర్‌ గుర్తులు పెట్టాలని సర్కార్‌ శాసిస్తున్నది.కంపెనీ పేరు కనబడకుండా డేంజర్‌ గుర్తులే ప్రధానంగా ఉండాలని చెబుతున్నది. ప్రతి ఏడాది ఈ డేంజర్‌ గుర్తులు మారుతుంటాయి. ఏ గుర్తు వస్తుందో తెలియదు.శాశ్వతమైన ట్రేడ్‌ మార్కు కనబడకుండా, కంపెనీ పేరు కనబడకుండా డేంజర్‌ గుర్తు మాత్రమే ప్రధానంగా కనబడడం వల్ల మార్కెట్‌ తగ్గుతుందనేది వాస్తవం.దీనికి తోడు బీడీ పరిశ్రమ ముడిసరుకు పైన, బీడీ ఉత్పత్తులపైన జీఎస్టీ 28 శాతం నేటి కేంద్రసర్కార్‌ అమలు చేస్తున్నది. వెయ్యి బీడీలు వెయ్యి రూపాయలకు మార్కెట్లో అమ్మితే అందులో నుండి రూ.280 జీఎస్టీ కింద చెల్లించవలసిందే. అంటే కష్టపడి బీడీలు చేసే బీడీ కార్మికుల కూలి కన్నా తక్కువేమీ కాదు. వసూలు చేసుకున్న పన్ను నుండి బీడీ పరిశ్రమ కోసం గానీ, వారి సంక్షేమానికి గానీ ఖర్చుపెట్టేది శూన్యం.
కార్మికుల పోరాటాల ద్వారా సాధించుకున్న బీడీ, చుట్ట కార్మికుల చట్టం-1966తో పాటు 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ లేబర్‌కోడ్‌లు కార్మికులకు ఊపిరాడకుండా చేస్తున్నది. అధిక పనిగంటలతో అవస్తల పాలు చేస్తున్నది. బీడీలు తాగితే అనారోగ్యం కదా! కాబట్టి బీడీ పరిశ్రమపైన ఆంక్షలు విధించడమేమిటి? నిషేధమే సరైనదని కూడా వాదించే వారు కూడా అధికమే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంతటి వారికైనా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రధానంగా ఉంటుంది. బీడీలు తాగిన వెంటనే చనిపోయినది ఎంతమంది? ఎవరూ లేరు. బీడీ కన్నా మద్యం,గుట్కా ,పాన్‌ పరాగ్‌,డ్రగ్స్‌ వంటివి చాలా ప్రమాదం కదా! వాటిని ఎందుకు మూసివేయించరు? పర్యావరణం దెబ్బతింటుందని భూగర్భ జలాలు కలుషితమవు తున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని పలుచోట్ల కొన్ని ఫ్యాక్టరీలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అనుమతులిచ్చేది సర్కారే. మరి వీరంతా పాలకులను ఎందుకు నిలదీస్తలేరు?
అనేక ప్రాంతాలలో చేనేత పరిశ్రమ దెబ్బతిన్నప్పుడు బీడీ పరిశ్రమ ఆదుకున్నది. వ్యవసాయంలో కూడా ఎగుడుదిగుడులు వచ్చి,పని చేయగలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది. ఆ విధంగా సుమారు కోటిన్నర మంది భారతీయులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని కల్పించిందీ బీడీ పరిశ్రమ. మన సర్కారు వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని చెబుతున్నా వందల్లో కూడా ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్నది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వపరంగా కేటాయించలేదు. అయినప్పటికీ, యజమానులు పరిశ్రమలో పనిచేస్తున్న వారందరూ సమన్వయంతో పనిచేయడం వల్ల లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నది. ఇంతమందిని ఇముడ్చుకున్న బీడీ పరిశ్రమను కాపాడుకోవలసిన బాధ్యత సర్కారుదా? కాదా? ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన కనీస బాధ్యతను విస్మరించి, నేడున్న అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు బీడీ పరిశ్రమపై శీతకన్ను వేసింది. డేంజర్‌ గుర్తుపెట్టాలని దాడి చేయడంతో పాటు 28శాతం జీఎస్టీని విధించింది.ఆ కారణంగానే బీడీ పరిశ్రమ సంక్షోభానికి గురై క్రమేణా క్షీణిస్తూ పోతున్నది. పరోక్షంగా కార్మికులను ఉపాధికి దూరం చేస్తున్నది.
‘కొట్పా’ చట్టం తీసుకొస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు జోడించింది. వీటివలన బీడీకట్టపై డేంజర్‌ సింబల్‌ ముద్రించాలని, అమ్మకం ప్రాంతాల్లో కూడా అనేక రకమైన ఆంక్షలు విధించడం వలన నేడు బీడీ పరిశ్రమ మార్కెట్‌ దెబ్బతిని అంతిమంగా బీడీ కార్మికులకు నెలలో పని దినాలు తగ్గుతూ కార్మిక కుటుంబాలకు ఆర్థిక నష్టం జరుగుతున్నది. అలాగే కార్మికులు 50 ఏండ్లు వచ్చే వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా బీడీలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రిటైర్మెంట్‌ అనంతరమైన తను జీవించడానికి సరిపడా పెన్షన్లు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అనేక సంవత్సరాలుగా బీడీ కార్మికులకు రిటైర్మెంట్‌ పెన్షన్‌ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీసం నెలకు పదివేల రూపాయలు కూడా అందడం లేదు. దీనిపై పోరాడుతున్నా పట్టించుకునే దిక్కులేదు.
గతంలో బీడీ కార్మిక కుటుంబాలలో ప్రాథమికవిద్య నుంచి ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేవి. వీటిని పూర్తిగా ఎత్తేశారు. కార్మికులు సొంతిల్లు నిర్మించుకుంటే గతంలో కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ నుండి రుణాలు అందేవి. అవి కూడా నిలిపివేశారు. బీడీ కార్మికులకు డిస్పెన్సరీ హాస్పిటల్స్‌ ద్వారా సంచార వాహనం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందించేవారు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ విధంగా బీడీ కార్మిక కుటుంబాలను అన్ని విధాలుగా కేంద్రం మోసం చేసింది.ఈ నేపథ్యంలో జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్మిక, ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి, లౌకికతత్వాన్ని నెలకొల్పే ‘ఇండియా’ కూటమిని గెలిపించాలి.
గొడ్డుబర్ల భాస్కర్‌
9849934514

Spread the love