బీరు పొంగింది

The beer overflowed–  చలికాలంలోనూ తగ్గని సేల్స్‌
– ఎన్నికల ప్రభావమేనంటున్న పరిశీలకులు
హైదరాబాద్‌ : బీరు అమ్మకాలు వేసవిలో పెరగడం సర్వసాధారణం. ఎందుకంటే వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మద్యపాన ప్రియులు ఎక్కువగా బీరును ఆశ్రయిస్తుంటారు. కానీ తెలంగాణలో మాత్రం చలికాలంలోనూ జోరుగా బీరు అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణ శాసనసభకు గురువారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. డబ్బు, మద్యం ఎర చూపి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్రంలో బీరు అమ్మకాలు పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ రాష్ట్రంలో 22 లక్షల కేసుల బీరు అమ్ముడుపోయిందని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రికకు తెలిపాయి. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ అమ్మకాలు జోరు మరింత పెరిగింది.
ఇదే సమయంలో మద్యం అమ్మకాలు కూడా ఓ మోస్తరుగా పెరిగాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు నుండే పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను మద్యం మత్తులో ముంచేయడం ప్రారంభించారు. మద్యాన్ని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఇప్పుడు దానిని ఎన్నికల అధికారుల కంట పడకుండా విడుదల చేస్తూ పంపిణీ చేస్తున్నారు. బీరుతో పోలిస్తే లిక్కర్‌ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. ఈ నెల 1 నుండి 20వ తేదీ వరకూ రూ.1,470 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మారు. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.1,260 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. అయితే అభ్యర్థులు ముందుగానే పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేశారని, అందుకే ఇప్పుడు అమ్మకాల్లో పెద్దగా పెరుగుదల కన్పించడం లేదని పరిశీలకులు తెలిపారు. ‘బీరు మాదిరిగానే మద్యాన్ని కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున ముందుగానే కొని నిల్వ చేశారు. గడచిన నెల రోజుల్లో అధికారులు రూ.100 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనినిబట్టి వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది’ అని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు.
రాష్ట్రంలోని మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రమే మూతపడ్డాయి. పోలింగ్‌ ముగిసే వరకూ వాటిని మూసి ఉంచుతారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ముందుగానే షాపుల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమకు అవసరమైన మద్యాన్ని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
2018 ఎన్నికల సమయంలో వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. పోలింగ్‌కు ముందు మద్యం అమ్మకాలు తగ్గాయి. 2017లో అదే కాలంతో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 35% పడిపోయాయి. కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే అమ్మకాలు తగ్గాయని ఎన్నికల అధికారులు అప్పట్లో చెప్పుకున్నారు.

Spread the love