– ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు బానిసలు
– సీఎం రేవంత్‌రెడ్డి కర్కోటకుడు
– కేసీఆర్ మరమనిషి..ఆయనో బందీ..
– అక్క నుంచి అమ్మగా పరిణితి చెందా: కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు
– ఘనంగా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) ఆవిర్భావం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర రాజకీయ చిత్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)గా అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో శనివారం ఉదయం ఆమె పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి మొదట్నుంచి తెలంగాణ అంటేనే ఇష్టం లేదని గుర్తుచేశారు. ఆ పార్టీలో ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరో తలకాయ లేని ఎంపీ తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చారని దుయ్యబట్టారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడినా సరే ఇక్కడి తెలంగాణ నుంచి ఎన్నికైన ఆ పార్టీ బానిస ఎంపీలు నోరు మెదపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వకపోయినా ప్రశ్నించటం లేదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని గుర్తుచేశారు. పోలవరం కారణంగా భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని బీజేపీ ఎంపీలను కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ జాగృతి పోరాడి కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆమె గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది తెలంగాణ బిడ్డలైతే రాముని గుడి మునిగిపోకుండా ఐదు గ్రామాలను తెలంగాణకు తేవాలని సవాల్ విసిరారు. భద్రాచలం రాముడు…..రాముడు కాదా? అని ఆమె ప్రశ్నించారు. మొదటి నుంచి కూడా బీజేపీ సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత విమర్శించారు. మహిళా బిల్లును, కుల గణన, బీసీ బిల్లును తొక్కి పెట్టి, పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్కోటకుడు, నియంత అని కవిత మండిపడ్డారు. వెలుగుమట్లలో అన్ని అనుమతులు ఉన్నా సరే అక్కడి ప్రజల ఇండ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన తన కండ్ల ముందు ఇంకా మెదులుతుందని చెప్పారు. కుమ్మెరలో రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కేసు పెట్టలేదని గుర్తుచేశారు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని విమర్శించారు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన మనిషి కాదనీ, ఆయన మరమనిషిగా మారారని కవిత విమర్శించారు. నాడు చనిపోయిన చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్, వెలుగుమట్లలో, హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చేస్తుంటే… అయ్యా కేసీఆర్ అని ప్రజలు పిలుస్తుంటే కూడా బయటకు రావటం లేదన్నారు. నాడు సింగరేణిలో కార్మికుడు చనిపోతే వెళ్లి పరామర్శించిన ఆయన…నేడు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయినా సరే పట్టించుకోలేదని విమర్శించారు. ఎందుకంటే ఆయన ఆత్మలేని మరబొమ్మా అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలపై ప్రేమ, మమకారం పోయిందా? అంటూ ప్రశ్నించారు. అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కేసీఆర్ గతంలో చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ తాను కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారన్నారు. ఆర్డీఎస్ ద్వారా నీళ్ల కోసం ఆనాడు పాదయాత్ర చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. ఏదో గొప్పకు పోయి పంజాబ్, గుజరాత్, బీహార్ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారని విమర్శించారు. ఓటమికి కారణాలు గుర్తించకపోగా ప్రజలే తప్పు చేశారన్నట్టు కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని కవిత అన్నారు. తాను ఎన్ని మాట్లాడినా సరే బీఆర్‌ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదన్నారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారని హెచ్చరించారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రథ చక్రం దారి తప్పిందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. సామాజిక తెలంగాణ రథ చక్రం పూర్తిగా విరిగి ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలు నెరవేరలేదనీ, బానిస సంకెళ్లు తెగిపోలే దన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ రైతులకు బేడీలు వేసిందనీ, ఇసుక దందా మీద ప్రేమతో దళితుల మీద లాఠీలు విరిగాయని గుర్తు చేశారు. ఫోన్లు ఎక్కడ వింటారోనని వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా బతకాల్సి వచ్చిందనీ, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ కుంగిపోయిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని రోడ్డున పడేసి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ….కనీసం ఉద్యమకారులకు నామినేటేడ్ పోస్టులు కూడా ఇవ్వలేదని కవిత తప్పుపట్టారు. ఉద్యమంలో మనల్ని అవహేళన చేసి లాఠీలతో కొట్టించిన వారే మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పెత్తనం చెలాయించారన్నారు. ఆనాడు పరిపాలన చేసిన కుటుంబంలో తాను కూడా భాగమేననీ, అందుకు సిగ్గుపడుతున్నానని తెలిపారు. ప్రజలు తనను క్షమించాలని కోరారు. అంతటితో సరిపోదనీ, సామాజిక తెలంగాణ కోసం కష్టపడి పని చేస్తాననీ, తన పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ అధికారం కావాల్సి ఉంటుం దని ఆమె అన్నారు. అందుకే రాజ్యాంగపరంగా ప్రజా ఉద్యమాలను మిళితం చేసి రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. ఏ పార్టీకైనా ఆత్మ నేపథ్యం ఉండాలనీ, బీఆర్‌ఎస్ దాన్ని కోల్పోయిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ఆత్మను కోల్పో యినందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చిందని వివరించారు.
అమ్మగా పరిపాలన అందిస్తా
తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత చెప్పారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. అమ్మ బిడ్డల కడుపులను చూస్తుందే తప్ప జేబులు చూడదని తెలిపారు. తెలంగాణలో ఏండ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభావులు పోరాడితేనే సమానత్వం వచ్చిందని తెలిపారు. మలిదశలో కేసీఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందని చెప్పారు.. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామనీ, మరో రెండేండ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అలుపెరగని పోరాటమే మా ఎజెండా
రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, మత విద్వేషం, బంధుప్రీతితో నిండిపోయాయని కవిత విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ ఎజెండా అయితే, పెద్ద సార్ ఫామ్‌హౌస్‌లో ఉండి…చిన్న సార్‌ను సీఎం చేయాలన్నది బీఆర్‌ఎస్ ఎజెండా అని చెప్పారు. సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బీజేపీ సింగిల్ ఎజెండా అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సాంస్కృతిక వికాసం కోసం తెలంగాణ జాగృతి అహర్నిశలు పిడికిలి బిగించి కొట్లాడిందని గుర్తు చేశారు. ఆ దీపాన్ని తెలంగాణ జాగృతి కార్యకర్తలు పదిలంగా కాపాడుకున్నారని గుర్తు చేశారు. కాలరాత్రిలో కాగడా మాదిరిగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ జాగతి వెలుగునిచ్చిందన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి ఇదీ….అని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆమె చెప్పారు. ఐతే ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్‌ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చానని చెప్పారు. తన జీవితంలో ఇది మరుపురాని రోజని అన్నారు.
అమరవీరులకు నివాళులు
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్‌లోని నివాసంలో కవిత, అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె భర్త అనిల్‌తో కలిసి అత్తామామలు దేవనపల్లి రాంకిషన్ రావు, నవలత ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపం టలతో అలరారే గ్రామ సీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెండాలో పొందుపరిచారు. పసుపు రంగు మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్ ముద్రించి ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్‌ఎస్ అని ముద్రించారు. కింద ఆకుపచ్చ రంగు పట్టీలో తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రింట్ చేశారు. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్‌తో కలిసి కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
టీఆర్‌ఎస్ పాంచజన్యం మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర సేన ఎజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదివినా కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వబోమని చెప్పారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్యకైనా కార్పొరేట్ వైద్యం చేయించుకున్నా సరే ప్రజలకు ఆ వైద్యాన్ని ఉచితంగానే అందించే బాధ్యత తనదని కవిత స్పష్టం చేశారు. రైతు సంక్షేమం అంటే రైతుకు గౌరవం వచ్చేలా కృషి చేయటమేననీ, తాము రైతులమని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరియా సహా రైతు సంక్షేమానికి చేయాల్సినవన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే తమ లక్ష్యమన్నారు. వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిప ˜ికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం జూన్ 2, 2014ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యో గాలు కల్పిస్తా మనీ, ఇక సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. హిందీలో తియ్యగా మాట్లాడి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మైనార్టీ ముస్లింలను మోసం చేశాయని కవిత విమర్శించారు. వారితో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాడు తుందని చెప్పారు. మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటం తో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రా క్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మాటిచ్చారు.
సామాజిక న్యాయానికి బద్ధవ్యతిరేకి బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



