2047 నాటికి ఈ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తాం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపిన సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ అవతరించనుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన భారతదేశపు తొలి ప్రయివేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను శనివారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో స్పేస్ పార్క్‌లోని మ్యాక్స్-క్యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు ఇది చేరుకోనుంది. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నదని అన్నారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకు వెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రయివేట్ ఆర్బిటల్ రాకెట్‌ను హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రాభివృద్ధికి ఇదొక మైలురాయని అభివర్ణించారు. స్కైరూట్ సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించిందనీ, అయితే ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం హర్షణీయమని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయని గుర్తు చేశారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రపంచాన్ని శాసించే దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24, 2024-25 మధ్యలో దేశంలోనే ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం అవసరాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. అందుకు అవసరమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకనుగుణంగా ప్రతిభావంతులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ j¶నివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) త్వరలో ఉన్నతీకరించబడనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆయన వివరించారు. స్కైరూట్ సంస్థ తమకు అవసరయ్యే నిపుణుల కోసం హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించాల్సిందిగా సీఎం ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్‌రెడ్డి, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా తదితరులు పాల్గొన్నారు.
స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేస్తాం : స్కైరూట్
యంగ్ ఇండియా స్కిల్స్ j¶నివర్సిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, కోఫౌండర్ పవన్ కుమార్ చందన తెలిపారు. స్కిల్స్ j¶నివర్సిటీ ద్వారా తమకు అవసరమైన ప్రతిభావంతులు దొరకడం సుగమం అవుతుందని అన్నారు. పరిశ్రమలుగా తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నైపుణ్యత, శిక్షణే అని ఆయన చెప్పారు.



