పడవ సాగుతుంది

రాత్రి నిస్సడిలో
కలలనది అలల సవ్వడి.

వెన్నెల అంచుల ఆవల
ఆవలిస్తూ
పలుచని చీకటి.

నక్షత్రరాశిలో పూర్వీకులు
తారకల కన్నులై చూస్తున్నారు.

ఈ రాత్రి చందమామ ఒక్కడినే
వలేసి పట్టి తెచ్చా.
తెల్లారి లేచి చూస్తే ఎగిరిపోయి
తెల్లని పక్షి రెక్కలా
ఆకాశంలో.

ఉదయపు నిస్సడిలో
వేకువనది అలల సడి.

జంఝాటాలు ఆరాటాలు
ఎదతటిలో చేపల్లా
తారాడుతున్నాయి.

దించుకున్న బరువులతో
తెరచాప ఎత్తిన ఒంటరి పడవతో
పయనమై పోవాలి.

సారంగు
సర్వసంగ పరిత్యాగి కాడు.

మజిలీ మజిలీకి మధ్య
జీవనవక్షం నుంచొక అనుభవపత్రం
రాలుతుంది.

మరొకవేపు
ఒక కొత్త జీవనకాంక్ష
మొగ్గ తొడుగుతుంది.

బంగారు వర్ణంలో
నది మరులు గొలుపుతుంది.
అంతులేని అగాధ సాగరంలో
పారిన నది కలుస్తుంది.

అనుదిన పాఠాల ఒరవడి సుడిలో..
పడవ సాగుతుంది.
కొనసాగుతుంది.
– పి.శ్రీనివాస్‌ గౌడ్‌
9949429449

Spread the love