సీఎం రూటు మారింది

సీఎం రూటు మారింది– సచివాలయ ప్రవేశ ద్వారాల మార్పు
– తొమ్మిదో ఫ్లోర్‌లోకి సీఎం కార్యాలయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం రూటు మారింది. ఇకపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లే ద్వారాలు మారాయి. పశ్చిమ ద్వారం నుంచి సీఎం కాన్వాయి ఎంట్రీ ఇవ్వనున్నది. తూర్పు ద్వారం నుంచి ఆ కాన్వాయి బయటకు వెళ్లనున్నది. అదే సమయంలో ప్రస్తుతం సచివాలయం ఆరో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయాన్ని తొమ్మిదో ఫ్లోర్‌కు మార్చాలనే నిర్ణయం అధికారికంగా జరిగింది. దానికి తగ్గట్టుగానే తొమ్మిదో అంతస్తులో పనులు చకచకా జరుగుతున్నాయి. వాస్తు కోసం మార్పులు చేర్పులు చేయాలన్న సీఎం సూచనలతోనే ఈ మార్పు జరిగినట్టు చర్చ కొనసాగుతున్నది. టీపీసీసీ బాధ్యతలు చేపట్టగానే సీఎం రేవంత్‌రెడ్డి వాస్తుకు తగ్గట్టుగా గాంధీభవన్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులు, చేర్పులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో కట్టిన నూతన భవనంలో మార్పులు చేయాల్సిన అవసరమేంటి? అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.
నాడు కేసీఆర్‌.. నేడు రేవంత్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్ర పేరును సూచించే పొడి అక్షరాలైన టీఎస్‌ను టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. వివాదాల నడుమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయజయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన విషయం విదితమే. ఇప్పుడు రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి మార్పు దిశగా అడుగులు వేస్తున్నది. రాజముద్ర (చిహ్నం) మార్పుపై పెద్ద రాద్ధాంతమే నడుస్తున్నది. దీంతో సీఎం వెనక్కి తగ్గారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఫైనల్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో రాజముద్ర మార్పునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. సీఎం చేస్తున్న ఈ మార్పులను ప్రజలు స్వీకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు చేసిన మార్పులను గుర్తు చేసుకుంటున్నారు. సీఎం ఎవరైనా సరే ఇలా వాస్తు మార్పులు, చేర్పులు మామూలే అన్నట్టు చర్చించుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసిన తర్వాత కూడా తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌ మార్పులు చేసిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో వాస్తు మార్పులు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.

Spread the love