లీకేజీ కేసులో.. ఎట్టకేలకు నిందితుల కస్టడికి కోర్టు అనుమతి

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుల కస్టడికీ కోర్టు అనుమతిచ్చింది. నిందితులను 10రోజలపాటు కస్టడీకి ఇవ్వాలంటూ కొద్ది రోజులముందు బేగంబజార్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 9మంది నిందితులను ఆరురోజులపాటు పోలీసు కస్టడీకి శుక్రవారం కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ, చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను శనివారం ఉదయం 10:30 గంటలకు సిట్‌ అధికారులు కస్టడీకి తీసుకునే అవకాశముంది. కస్టడీకి తీసుకుని ఇన్వెస్టిగేషన్‌ను సీరియస్‌గా చేయనున్నారు. ఇప్పటికే విచారణకు సంబంధించి పలు ప్రశ్నల జాబితాను సిట్‌ అధికారులు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ముందుగా 9 మందిని వేర్వేరుగా ప్రశ్నించనున్నారు. వారు చెప్పే సమాధానాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించాలని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.
అన్ని విషయాలు తేల్చనున్న సిట్‌
ఇన్వెస్టిగేషన్‌ సీరియస్‌గా చేయనున్న సిట్‌ అధికారులు రాజశేఖర్‌కు రాజకీయ నాయకుల సంబంధాలపై ఆరా తీయనున్నారు. రాజశేఖర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కలిసి లక్ష్మీని ట్రాప్‌ చేసి పాస్‌వర్డ్‌, ఐడీలను దొంగలించి పేపర్లను కాపీ చేసినట్టు సిట్‌ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే లీక్‌ చేసిన పేపర్స్‌ను ప్రవీణ్‌ ఎవరెవరికి ఇచ్చారన్నదానిపై విచారణ చేయనున్నారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించిన విషయం తెలిసిందే. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా మరింత లోతుగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందితులను అన్ని కోణాల్లో విచారిస్తామని, ఈ దర్యాప్తులో అన్ని విషయాలు తేలనున్నాయని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి అభిప్రాయపడ్డారు.
డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్‌
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి రాజశేఖరే అని సిట్‌ అధికారులు టీఎస్‌పీఎస్సీకి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. గతంలో టెక్నికల్‌ సర్వీస్‌లో పనిచేసిన రాజశేఖర్‌.. ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై వచ్చి వ్యవహారం నడిపినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా ప్రవీణ్‌కు గ్రూప్‌ 1 పరీక్షలో 102 మార్కులు రావడంపై కూడా సిట్‌ అధికారులు దృష్టి సారించారు. ఇక ఎన్ని ప్రశ్నాపత్రాలు లీక్‌ చేశారనే విషయాలు మాత్రం సిట్‌ దర్యాప్తులో తేలనుంది.

Spread the love