Friday, April 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునోయిడా పోరాటంపై అణచివేత దారుణం

నోయిడా పోరాటంపై అణచివేత దారుణం

- Advertisement -

కార్మికుల హక్కులను రక్షించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం అమలు చేస్తున్న అణచివేత చర్యలు అత్యంత దారుణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ విమర్శించారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్‌లో నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల పోరాటాన్ని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ కార్మికుల హక్కులను రక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచాలనీ, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలనీ, కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలనీ, తదితర సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుతంగా చేపట్టిన పోరాటాన్ని అణచివేయడం అన్యాయమన్నారు. కార్మికులపై లాఠీచార్జీలు, అరెస్ట్లులు, నిర్బంధాలు ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. కార్మికులు తమ బ్రతుకు కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం బయటి శక్తుల ప్రేరణగా చిత్రీకరించి వారి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్ళించే కుట్రకు పాల్పడిందని విమర్శించారు. ఇది కార్మికవర్గాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు. వందలాది మంది కార్మికులను అరెస్ట్‌ చేయడం, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులను గృహ నిర్బంధం చేయడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడటం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హర్యానా, మధ్యప్రదేశ్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల లాభాల కోసం కార్మిక హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కార్మికుల పోరాటంపై నిర్బంధాన్ని ఎత్తివేయాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, వి.ఎస్‌. రావు, కోశాధికారి వంగూరు రాములు, కార్యదర్శులు కూరపాటి రమేష్‌, పుప్పాల శ్రీకాంత్‌, పి. సుధాకర్‌, ఎస్‌ డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, టీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి కుమార్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఎ. సునీత, సెంట్రల్‌ సిటీ నాయకులు నరేష్‌, గ్రామ పంచాయతీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ళ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -