– ఫీజు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వని స్కూల్ యాజమాన్యం
– పాలిటెక్నిక్‌లో ఉచిత సీటు సాధించినా సర్టిఫికెట్లు లేక అయోమయం
– విద్యార్థి గోడును చూసి స్పందించిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
– తానే మొత్తం ఫీజు చెల్లిస్తానని హామీ
నవతెలంగాణ-బోడుప్పల్: ఆ విద్యార్థిని చదువుల్లో టాపర్. పదో తరగతి 2026 పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించింది. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయగా, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా 634 ర్యాంక్ సాధించి ఉచిత సీటు పొందింది.
కళాశాలలో చేరడమే మిగిలి ఉందని భావించిన ఆ విద్యార్థినికి ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సరస్వతి కటాక్షం ఉన్నా, లక్ష్మీ కటాక్షం లేక చదువును కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే, మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లిలోని గ్రీన్ ఫీల్డ్ పాఠశాలలో చదివిన భవిత ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసి 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించి ప్రతిభ కనబరచింది. అదే సమయంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలో కూడా మంచి ర్యాంక్ సాధించి ఉచిత సీటు పొందింది.
కౌన్సిలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్ల కోసం తాను చదివిన పాఠశాలకు వెళ్లగా, బకాయి ఫీజు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ విద్యార్థిని తీవ్ర అయోమయంలో పడింది. తన తండ్రి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, పూట గడవడమే కష్టమని వేడుకున్నా, పాఠశాల యాజమాన్యం కనీసం కనికరం చూపలేదు.
చివరకు తన చదువు కొనసాగాలని కోరుతూ, ముఖ్యమంత్రి స్పందించి సర్టిఫికెట్లు అందించాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి, ఆ విద్యార్థిని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ నంబర్ అందుబాటులో లేకపోవడంతో నేరుగా పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి, బకాయి ఫీజు తానే చెల్లిస్తానని, వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు.
ఇలాంటి ఘటనలు ఒక్క భవితకే పరిమితం కావు. సరస్వతి కటాక్షం ఉన్నా, లక్ష్మీ కటాక్షం లేక ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులు అనేకమంది ఉన్నారు. ఈ విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరించాల్సిన పాఠశాల యాజమాన్యాలు, లాభాపేక్షతో మాత్రమే నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనిని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు కూడా సరైన విధంగా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



