స్వగ్రామం చేరిన గల్ఫ్‌ వలసజీవి మృతదేహం

– మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు
నవతెలంగాణ – కొనరావుపేట
ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెల్లి గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మైలారం నర్సయ్య(41) ఇరవై ఏండ్లుగా బెహ్రయిన్‌ దేశం వెళ్తున్నాడు. అక్కడి బల్దియా కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఇటీవలే వెకేషన్‌పై ఇంటికి వచ్చి ఈనెల 5న మళ్ళీ బెహ్రాయిన్‌ వెళ్ళాడు. ఈ నెల 26న డ్యూటీలో ఉండగా గుండె పోటుకు గురై మృతి చెందాడు. విషయాన్ని కంపనీ హెచ్‌ఆర్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు 3రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డాడీ డాడీ లే డాడీ అనీ నర్సయ్య కూతురు రోదిస్తున్న తీరును చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య అనురాధ,కుమారుడు అభినాశ్‌, కూతురు శ్రుతి ఉన్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
ఎమ్మేల్యే చొరవతో..
నర్సయ్య బెహ్రాయిన్‌లో మృతి చెందిన విషయాన్ని ఎమ్మేల్యే చెన్నమనేని రమేష్‌ బాబు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా కేటీఆర్‌ అక్కడి ఎంబసీతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హైదరాబాద్‌ ఏయిర్‌ పోర్ట్‌ చేరుకున్న మృతదేహాన్ని తరలించేందుకు ఎమ్మేల్యే అంబులెన్స్‌ ఏర్పాటు చేశారన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ గున్నాల అరుణ, గ్రామస్తులు కోరారు.

Spread the love