ఉద్యోగ, కార్మికుల డిమాండ్ లను మేనిఫెస్టోలో చేర్చాలి 

– కార్మిక సామాజిక భద్రత చట్టాలను పటిష్టం చేయాలి 

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ పెద్దవంగర:
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగం, కార్మికుల న్యాయపరమైన డిమాండ్ లను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో యూనియన్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగ, కార్మికుల డిమాండ్లకు పరిష్కారాలు మేనిఫెస్టోలో చేర్చకపోవడం సమంజసం కాదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించేందుకు కార్మిక వర్గం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క పరిశ్రమ కూడా లేని జిల్లా మహబూబాబాద్ అని, జిల్లాలో ఉక్కు, బైరటిస్, సున్నం పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. హమాలి, ట్రాన్స్పోర్ట్, స్ట్రీట్ వెండర్స్, మిర్చి తొడిమెలు తీసేటువంటి అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ, ఐకెపి వీవోఏ, మధ్యాహ్న భోజన కార్మికులకు సామాజిక భద్రత చట్టాలను అమలు చేయాలన్నారు. తక్షణమే కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. కార్మికుల హక్కులకు భరోసా కల్పించే, సామాజిక భద్రత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దుం‌డి వీరన్న, సీనియర్ నాయకులు బొల్లం అశోక్, ఎండీ యాకూబ్, జిల్లా నాయకులు జమ్ముల శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రాపోలు వీరన్న, సీఐటీయూ మండల అధ్యక్షుడు కసరబోయిన కుమారస్వామి, తిమ్మిడి రవి, గుంటుక కుమార్, పిట్టల రాములు, అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పసుల స్వరూప, నాయకులు ఝాన్సీ, మంజుల, రేణుక, సరళ తదితరులు పాల్గొన్నారు.
Spread the love