అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి

– సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్‌ కన్వీనర్‌ అల్లి దేవేందర్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలి సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్‌ కన్వీనర్‌ అల్లి దేవేందర్‌, ఆపార్టీ మండల కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి అన్నారు.శుక్రవారం శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ శంకర్పల్లి పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే చేసినుట్ట చెప్పారు.ఈ సర్వేలో శంకర్పల్లి మున్సిపల్‌ కేంద్రంలో సొంత ఇండ్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారనీ, వారంతా వేల రూపాయల ఇంటి కిరాయిలు కట్లలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ నిరుపేదలంతా కష్టపడి సంపాదించిందంతా తినడానికి, ఇంటి కిరాయి కట్టడానికే సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి, అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనియేడల శంకర్పల్లి పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదలకు పంచి పెడుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గాల్లోనే డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు.కానీ ఏ జిల్లాల్లో కూడా ఇండ్లు మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు. లేనియేడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి శ్రీనివాస్‌, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మండల నాయకులు నరసింహ తదితరులు ఉన్నారు.

Spread the love