వివాదం ముగిసింది

The controversy is over– సన్‌రైజర్స్‌తో హెచ్‌సీఏ భేటీ
– పరస్పర సహకారానికి అంగీకారం
నవతెలంగాణ-హైదరాబాద్‌:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వివాదానికి తెరపడింది. రెండు రోజులుగా ఈమెయిల్స్‌లో యుద్ధం చేసిన ఐపీఎల్‌ ప్రాంఛైజీ, రాష్ట్ర క్రికెట్‌ సంఘం వివాదానికి ముగింపు పలికాయి!. ఉప్పల్‌ స్టేడియంలో మంగళవారం హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌తో సన్‌రైజర్స్‌ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ భేటీకి అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు దూరంగా ఉండగా.. కార్యదర్శి ఆర్‌.దేవరాజ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఐపీఎల్‌18లో రానున్న మ్యాచులను విజయవంతంగా నిర్వహించేందుకు సన్‌రైజర్స్‌, హెచ్‌సీఏ కలిసికట్టుగా పని చేయాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఈ భేటీలో నిర్ణయించారు. బీసీసీఐ, హెచ్‌సీఏ, సన్‌రైజర్స్‌ నడుమ ట్రైపార్టీ ఒప్పందం ప్రకారం పని చేసేందుకు తీర్మానించారు. ఏండ్లుగా కొనసాగుతున్న పద్దతిలో భాగంగానే హెచ్‌సీఏకు ప్రతి మ్యాచ్‌కు స్టేడియం సామర్థ్యంలో పది శాతం పాస్‌లు (3900) కేటాయించేందుకు సన్‌రైజర్స్‌ ప్రతినిధులు అంగీకరించారు. ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను విజయవంతం చేసేందుకు హెచ్‌సీఏ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఈ సందర్భంగా దేవరాజ్‌ హామీ ఇచ్చారు. మంగళవారం నాటి సమావేశంతో అభిప్రాయ భేదాలకు పరిష్కారం లభించిందని, తమ మధ్య ఉన్న వివాదం ముగిసిందని సన్‌రైజర్స్‌, హెచ్‌సీఏ సంయుక్త ప్రకటన చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో ఈ ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ జరుగనుంది.
విజిలెన్స్‌ విచారణ షురూ : సన్‌రైజర్స్‌ను హెచ్‌సీఏ వేధించిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ మొదలైంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోని సిట్‌ బృందం మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. హెచ్‌సీఏ అధికారిక ఈమెయిల్స్‌, టికెట్ల అంశంలో సన్‌రైజర్స్‌తో సంప్రదింపుల వివరాలను సిట్‌ బృందం సేకరించినట్టు సమాచారం.

Spread the love