ఎన్నికల జాతర షురూ..

– సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎంపీ ఎన్నికలు,
– పల్లె బాట పడుతున్న ఆశావహులు, ఏర్పాట్లలో రాజకీయ పార్టీలు, అధికారులు,
– మళ్లీ అమల్లోకి రానున్న కోడ్..
నవతెలంగాణ- సూర్యాపేట
వచ్చే ఏడాది 2024 లో జనవరి నుంచి మే వరకు వరుసగా ఆరు నెలలు ఎన్నికల జాతర షురూ కానున్నది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగులకు రానున్న ఎన్నికల జాతర వరంగా మారనున్నది.నూతన సంవత్సరంలో జనవరిలో జరుగుతాయని భావిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.ఇదిలావుండగా  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి జరగబోయే  సర్పంచ్, ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల లోపే నిర్వహిస్తారా లేకపోతే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత  నిర్వహిస్తారా అనేది సందిగ్దత నెలకొంది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఎత్తున స్థానాలను సాధించి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని అన్నిట్లో కూడా క్లీన్ స్వీప్ సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ యంత్రాంగానికి దశ దిశ చూపే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల సందడి ముగిసిపోయిన తరువాత యూటర్న్ తీసుకోకముందే స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే జనవరి నెల నుండి మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు వరుసగా ఆరు నెలల పాటు ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో  పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు  ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని జాతీయ రాజకీయాలలో తెలంగాణ సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా జనవరిలో పంచాయతీ ఎన్నికల అనంతరం ఏప్రిల్,మే నెలలో ఎం పి టి సి, జెడ్ పి టి సి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇది కాక మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వరసగా ఆరు నెలల పాటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశావహులు పల్లె బాట పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల ఏర్పాట్లు, యంపీ ఎన్నికలకు గాను ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టినా నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఆశావహులు గ్రామాలలో పర్యటనలను  మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో పల్లె పోరు కు రాజకీయ పార్టీలు, అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా తండాలు గ్రామపంచాయతీ లుగా మారాయి. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన  ప్రారంభమైంది. జనవరి నెలలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలలో విలీనమైన విషయం  విధితమే. అదేవిధంగా ఎంపిటిసి, జెడ్పిటిసి ల పదవీ కాలం మే నెలతో ముగియనున్నందున వీటికి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది దాదాపుగా ఆరు నెలలపాటు మరోమారు ఎన్నికల జాతర  జిల్లాలో కొనసాగనున్నది. ఈ జాతర తో రాజకీయ పదవులు లేనివారు ఆశావహులకు పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెల చివరి లో షెడ్యూల్ విడుదలైతే మరోమారు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇంకా తేరుకోకముందే గ్రామపంచాయతీ ,ఎంపీటీసీ, జడ్పిటిసి, పార్లమెంటు ఎన్నికలు వస్తుండడంతో రాజకీయ పార్టీలలో మరోమారు ఎన్నికల వేడి రాజుకొనున్నది.
Spread the love