నియోజక వర్గం కేంద్రం లో ఎన్నికల ప్రక్రియ హడావుడి..

– పార్టీ నాయకులు,సెక్టార్ ఆఫీసర్ లు,బి.ఎల్.ఒ తో సమావేశాలు….

– అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి – అదనపు కలెక్టర్,ఈ.ఆర్.ఒ రాంబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అక్టోబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండటంతో ఎన్నికల ప్రక్రియ ను అధికారులు వేగవంతం చేసారు. అదనపు కలెక్టర్,నియోజక వర్గం ఎన్నికల అధికారి పర్సా రాంబాబు శుక్రవారం అశ్వారావుపేటలో గుర్తింపు ఉన్న పార్టీల ప్రతినిధులతో ను,పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షకులు అయిన సెక్టార్ అధికారులతో ను,పోలింగ్ బూత్ లెవెల్ అధికారులతో ను ఒకే రోజు సమావేశాలు నిర్వహించారు. ముందుగా తహశీల్దార్ కార్యాలయంలో నాయకులతో సమావేశం అయిన ఆయన పార్టీల బూత్ స్థాయి ప్రతినిధులను నియమించి ఎన్నికల బూత్ లెవల్ అధికారులతో సమన్వయంగా పనిచేసి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కోరారు. సెక్టార్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు. బి.ఎల్.ఒ లు శని ,ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల్లో నే కొత్త ఓటు నమోదు,మార్పులు చేర్పులు కోసం నేరుగా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అయిదు మండలాల తహశీల్దార్ లు,ఎం.పి.డి.ఒ లు,బి.ఎల్.ఒ లు పాల్గొన్నారు.
Spread the love