– రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
– నీట్ పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమే..
– తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీ టార్గెట్ :పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచడం ప్రజలకు భారంగా మారిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సంగారెడ్డిలో నిర్మలా జగ్గారెడ్డి నివాసంలో శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు చేపట్టడం మోసపూరితం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని విమర్శించారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
బెంగాల్, తమిళనాడులో ఎన్నికల చివరి దశకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెప్పి.. ఇప్పుడు పెంచడం ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన సమయంలో కేంద్రం ప్రజలకు ఎప్పుడైనా ఉపశమనం కల్పించిందా? అని ప్రశ్నించారు. ”ఇప్పుడు రూ.3 పెంచి, ఇంకా ధరలు పెరిగే సంకేతాలు ఇస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై అదనపు భారం మోపి పేదల, సామాన్య ప్రజల నడ్డి విరచడమే బీజేపీ అసలు స్వరూపం” అని విమర్శించారు. 12 ఏండ్లలో అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యల్ప స్థాయికి చేరినా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం కల్పించలేదని చెప్పారు. ప్రజలను విభజించడం, వారి మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా జీవించాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని తెలిపారు. నీట్ పరీక్ష లీకేజీ ఘటన.. రద్దుతో దాదాపు 23 లక్షల విద్యార్థుల భవిష్యత్‌తో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞానవంతులని, బీజేపీ కుట్రపూరిత రాజకీ యాలను అంగీకరించరని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికే కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీగా ధాన్యం మార్కెట్‌కు వచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనుగోలు చర్యలు కొనసాగు తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులకు ఒకసారి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహిస్తున్నారని, చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ ధరల పెంపు..మోసపూరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



