Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంభారత్‌‌కు హార్ముజ్ సంక్షోభం ఒక హెచ్చరిక

భారత్‌‌కు హార్ముజ్ సంక్షోభం ఒక హెచ్చరిక

- Advertisement -

చైనా తరహా ప్రత్యామ్నాయలపై దృష్టి పెట్టాలి : ఆర్‌‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ సూచన
న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య మార్గాల అంతరాయాలు, సుంకాల యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాలను ఎదుర్కొంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇటీవల తలెత్తిన హార్ము జ్‌ ‌జలసంది సంక్షోభం భారత్‌కు ఒక హెచ్చరిక లాంటిదని ఆయన స్పష్టం చేశారు. దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారత్ తన వ్యూహాత్మక చమురు నిల్వలను భారీగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఒక ప్రముఖ బిజినెస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ ఎకానమీ, భారత ఆర్థిక స్థితిగతులపై కీలక విశ్లేషణ చేశారు.

ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలి
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం వల్ల బయటపడిన బలహీనతలు అంత సులభంగా తొలగిపోవని రాజన్ స్పష్టం చేశారు. భారత్‌కు అవసరమైన ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌ఎన్‌‌జీ దిగుమతుల్లో ఎక్కువ భాగం ఈ మార్గం గుండానే వస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో చైనా తరహాలోనే బొగ్గు ఉత్పత్తిని వేగంగా పెంచే ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు.దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధనం వైపు మొగ్గు చూపడం మంచిదే అయినప్పటికీ సోలార్ సెల్స్, విండ్ కాంపోనెంట్స్ కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని గుర్తు చేశారు. ఈ సరఫరా గొలుసు రిస్క్‌ను అధిగమించడానికి దేశీయ పరిశ్రమలు సొంతంగా ఎదిగేందుకు చొరవ చూపాలని సూచించారు.

సుంకాలపై దృష్టి పెట్టాలి
వాణిజ్య పరంగా అమెరికా నుంచి ఎదురవుతున్న సుంకాల భయాల విషయంలో భారత్ ప్రస్తుతానికి కాస్త మేనేజ్ చేయదగిన స్థితిలోనే ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. భారత్‌పై 12. శాతం సుంకం విధించే అవకాశం ఉందని.. ఇది పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌‌లపై అమలు చేస్తోన్న 10 శాతం కంటే కాస్త ఎక్కువేనన్నారు. అయితే అదనపు సామర్థ్యం పై జరిగే విచారణ వల్ల మరిన్ని అదనపు సుంకాలు పడే ప్రమాదం ఉందని భారత వాణిజ్య అధికారులు దీనిపై ముందే దృష్టి పెట్టాలని హెచ్చరించారు.

రూపాయిపై ఎఫ్‌‌డిఐల ప్రభావం..
గడిచిన రెండేండ్లలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 14 శాతం క్షీణించడానికి కేవలం చమురు ధరలే కారణం కాదని.. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గడమే ప్రధాన కారణమని విశ్లేషించారు. దేశ జీడీపీ బలంగా ఉన్నప్పటికీ దేశీయ పెట్టుబడులు పెరగకపోవడంపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో ముప్పు చమురు రూపంలో కాకుండా జనరిక్ ఔషధాల తయారీకి వాడే ఫార్మా ముడిపదార్థాల రూపంలో రావచ్చని హెచ్చరించారు.కాబట్టి భారత్ రాబోయే 3 నుంచి ఐదేండ్ల కాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక బఫర్ స్టాక్‌లను నిర్మించుకోవాలని.. స్నేహపూర్వక దేశాలతో సరఫరా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇటీవల ఎదురైన ఆర్థిక సమస్యలు, సవాళ్లు పాలకులకు పరిశ్రమలకు ఒక మేల్కొలుపు లాంటిదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -