Thursday, June 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌తో శాంతిరష్యాకు ట్రంప్‌ సూచన…జెలెన్‌స్కీతో భేటీ

ఉక్రెయిన్‌తో శాంతిరష్యాకు ట్రంప్‌ సూచన…జెలెన్‌స్కీతో భేటీ

- Advertisement -

ఎవియన్‌-లెస్‌-బెయిన్స్‌ : ఉక్రెయిన్‌తో రష్యా శాంతిని నెలకొల్పు కోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. ఫ్రాన్స్‌లో జరుగు తున్న జీ-7 దేశాల సదస్సు సంద ర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఘర్షణలను నివారించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అయితే ఇందుకోసం మాస్కోపై ఒత్తిడి తేవడానికి తీసుకోబోయే చర్యలేమిటో ఆయన వివరించలేదు. యుద్ధ రంగంలో ఇరు వైపులా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకోసం తాను చేయగలిగింది చేస్తానని చెప్పారు. కాగా ట్రంప్‌ వ్యాఖ్యలు శాంతి ఒప్పందానికి దోహదపడతాయని జీ-7 సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రకటనపై జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ వ్యాఖ్యానిస్తూ ఆయన చాలా సహకార ధోరణితో ఉన్నారని అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి యూరోపియన్లు, అమెరికన్లు చేయగ లిగినంత ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ట్రంప్‌తో సమావేశమైన తర్వాత జెలెన్‌స్కీ మాట్లాడుతూ యుద్ధంలో రష్యా గెలవడం లేదని జీ-7 నేతలు అంగీకరించారని చెప్పారు. రష్యాను చర్చల వేదిక వద్దకు రప్పించడానికి చమురు ఎగుమతులు, బ్యాంకింగ్‌ రంగం, సైనిక ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకొని అదనపు ఆంక్షలు విధించే విషయంపై కూడా వారు చర్చించారని తెలిపారు. కాగా రష్యా దాడులకు సంబంధించిన చిత్రాలను ట్రంప్‌కు జెలెన్‌స్కీ చూపించారని యూరోపియన్‌ దౌత్యవేత్తలు తెలియజేశారు. రష్యా దాడులపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అయితే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే విషయంపై ట్రంప్‌ ఎలాంటి హామీలు ఇవ్వలేదని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -