నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 50 నగరాలు భారత్ లోనే ఉన్నట్లు నివేదిక తెలిపింది. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ 50 నగరాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైనట్లు వాయు నాణ్యత, వాతావరణ సూచిక (ఎక్యూఐ) తెలిపింది. దేశంలోని ఉత్తర, మధ్య మరియు తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు విజృంభించడంతో.. మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయినట్లు నివేదిక తెలిపింది. ఒడిశాలోని బలాంగిర్ 45డిగ్రీల ఉష్ణోగ్రతతో అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. ఆ తర్వాత 44డిగ్రీల ఉష్ణోగ్రతతో చంద్రాపూర్, ప్రయాగ్‌రాజ్‌లతో పాటు ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్‌లలోని పలు నగరాలు నిలిచాయి. అయితే ఈ జాబితాలో సగానికి పైగా నగరాలు ఉత్తరప్రదేశ్ లోనే ఉండటం గమనార్హం. వారణాసి, బందా, బరేలీ, అయోధ్యల్లో మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 42డిగ్రీల నుండి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఎపి, తెలంగాణల్లో భీమవరం, ఆదిలాబాద్, జగిత్యాలలు ఈ జాబితాలో నిలిచాయి.
వాయువ్య, మధ్య భారతదేశ వ్యాప్తంగా వారంరోజుల పాటు తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.



