భారత్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ గుర్తింపు ప్రశ్నార్ధకం ?

Is NHRC's recognition questionable in India?– మైనారిటీలకు, మహిళలకు ప్రాతినిధ్యం కొరవడిందంటూ ఆందోళనలు
– జెనీవాలో బుధవారం సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ : భారతదేశంలో మానవ హక్కులకు సంబంధించి ప్రభుత్వం అనుసరించే ప్రక్రియలను అంతర్జాతీయ వేదికపై సమర్ధించుకోవడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సమాయత్తమవుతోంది. ఈ వారంలో జెనీవాలో ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ సమావేశం జరగనుంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ”ఎ హోదా”ను నిలబెట్టుకుంటుందా లేదా అనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై దర్యాప్తుల్లో పోలీసు సిబ్బంది వుండడం, లింగ, మైనారిటీ ప్రాతినిధ్యం కొరవడడం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి రేటింగ్స్‌ను 2023లోలో నిలుపుచేశారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి గుర్తింపు ప్రశ్నార్ధకంగా మారింది. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో ఆ విషయం తేలుతుంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎ రేటింగ్‌ ఇస్తారా లేదా బి రేటింగ్‌ ఇస్తారా అనే అంశంపై తీసుకునే నిర్ణయం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో, మరికొన్ని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సంస్థల్లో ఓటింగ్‌ సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) సబ్‌ కమిటీ సమావేశం మే 1వ తేదీన జరగనుంది. 114 మంది సభ్య దేశాలు గల ఈ కూటమిలో ప్రతి సభ్య దేశం పనితీరుపై ఐదేళ్ళకోసారి సమీక్ష జరుగుతుంది. అందులో భాగంగా అక్రిడిటేషన్లపై సబ్‌ కమిటీ (ఎస్‌సిఎ) బుధవారం సమావేశమవనుంది. గతేడాది సమావేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్‌పర్సన్‌, రిటైర్డ్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ మిశ్రా జెనీవా వెళ్ళారు. ఈ ఏడాది ఈ సమావేశానికి ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆన్‌లైన్‌లోనే హాజరవుతుందని భావిస్తున్నారు. ఈ సమీక్షా క్రమంలో ప్రమేయం వుండే వివిధ దేశాలతో దౌత్య మార్గాల ద్వారా మాట్లాడి విదేశాంగ శాఖ తమ వాదనను బలోపేతం చేసుకుంటోంది. దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై రేటింగ్‌ తగ్గించే పరిస్థితులను ఇలా ఎదుర్కొనాల్సి రావడం మోడీ ప్రభుత్వానికి ఇది రెండోసారి. 1999లో గుర్తింపు పొందినప్పటి నుంచి భారత్‌ 2006, 2011లో ఎ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 2016లో గుర్తింపును వాయిదా వేశారు. ఏడాది తర్వాత పునరుద్ధరించారు. గతేడాది మార్చిలో ఎస్‌సిఎ ఆరు పాయింట్లతో తన అభిప్రాయాన్ని అందచేసిన ప్రకారం, ”ప్రభుత్వ జోక్యంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడానికి” అనువైన పరిస్థితులను నెలకొల్పడంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విఫలమైంది. దర్యాప్తు ప్రక్రియల్లో పోలీసు అధికారుల ప్రమేయం వుంటోందంటూ కమిటీ భారత్‌ను విమర్శించింది. ఇది ఆశించిన ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన
ఎన్‌హెచ్‌ఆర్‌సి సెక్రెటరీ జనరల్‌, సీఈఓ, గుజరాత్‌ కేడర్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి భరత్‌ లాల్‌తో సహా ప్రభుత్వ అధికారులు వుండడం వల్ల కమిషన్‌కు మరింత సమర్ధత పెరుగుతోందని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. బహుళవాదం, లింగ ప్రాతినిధ్యం కొరవడిందని కూడా అక్రిడిటేషన్లపై సబ్‌ కమిటీ (ఎస్‌సిఎ) పేర్కొంది. జాతీయ మహిళా కమిషన్‌ ఎక్స్‌ అఫీషియో ప్రతినిధిగా ఎన్‌హెచ్‌ఆర్‌సిలో కేవలం ఒకే ఒక మహిళ వున్నారు. 2023 డిసెంబరులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ మరో మహిళ విజయ భారతి సాయనిని నియమించింది. మరో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌పురా వున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద మైనారిటీ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక్క సభ్యుడు కూడా లేకపోవడాన్ని సూచిస్తూ సమాజంలోని వైవిధ్యతను ప్రతిబింబించేలా కమిటీ కూర్పు వుండాలని కూడా ఎస్‌సిఎ పేర్కొంది. దీనికి తోడు చాలా మంది సభ్యులు పాలక పార్టీకి రాజకీయంగా అనుబంధమైన వారేనని స్థానిక సివిల్‌ సొసైటీ కార్యకర్తలు తెలిపారు. 10మంది సభ్యుల్లో ఐదుగురు బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందినవారే. వారిలో గుజరాత్‌లో బీజేపీ ప్రతినిధిగా వున్న జాతీయ ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ కిషోర్‌ మక్వానా, మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే అయిన జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అంతార్‌ సింగ్‌ ఆర్య, మాజీ బీజేపీ ఎంపీ, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హంసరాజ్‌ అహిర్‌, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యురాలు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక కనూంగు వున్నారు. కమిటీ సభ్యులు ఎస్‌సిఎ చేసిన విమర్శలను తోసిపుచ్చారు. సభ్యులందరినీ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియల ద్వారానే ఎంపిక చేశామని, ఈ ఎంపికలో ప్రతిపక్షాల నేతలు కూడా పాల్గొన్నారని చెప్పారు. భారతదేశ అక్రిడిటేషన్‌ హోదాపై వ్యాఖ్యానించడానికి విదేశాంగ శాఖ, ఎన్‌హెచ్‌ఆర్‌సీలు తిరస్కరించాయి. బుధవారం నాటి సమావేశంలో తిరిగి ‘ఎ’ హోదా పునరుద్ధరించబడుతుందని ప్రభుత్వం ఆశాభావంతో వుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయినా దేశంలోని మానవ హక్కుల రికార్డుపై బయటివారు ఇచ్చే సర్టిఫికెట్‌లపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం లేదని ఆ వర్గాలు తెలిపాయి.
2014 నుండి భారతదేశాన్ని విమర్శిస్తూ వస్తున్న అంతర్జాతీయ పౌర సమాజ సంస్థల అనవసరమైన ప్రభావం కూడా దీంట్లో వుందంటూ ఆ వర్గాలు విమర్శించాయి. ఈ ఏడాది మార్చి 26న అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌లతో సహా 9 మానవ హక్కుల గ్రూపులు జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐకి ఒక లేఖ రాశాయి. ఎన్నికల వేళ భారతదేశంలో పౌర సమాజంపై ఆంక్షలు పెరుగుతున్నాయని, మైనారిటీల పట్ల వివక్ష నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, నైగర్‌, రష్యాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయయా దేశాలకు కూడా ఈ గుర్తింపును తొలగించాలని ఎస్‌సిఎ సిఫారసు చేసింది.

Spread the love